గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడి ఘటన చోటుచేసుకుంది. దీంతో ప్రజలు తీవ్రంగా ఆగ్రహించారు, జాతీయ రహదారిపై భైటాయించి నిరసన తెలిపారు. చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈ అకృత్యానికి పాల్పడ్డ సుబ్బయ్య (55)ని త్వరలోనే పట్టుకుంటామని డీజీపీ ఎమ్. మాలకొండయ్య చెప్పారు. అయితే, అంశంపై ప్రతిపక్ష నేత జగన్ స్పందించారు. ఈ పాశవిక ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. ఇలాంటి ఘాతుకాలు జరగడానికి కారణం చంద్రబాబు వైఖరే అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయనీ, నిందితులను సరిగా శిక్షించి ఉంటే పునరావృతం అయ్యేవి కావని జగన్ అన్నారు.
ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నవారిలో ఎక్కుమంది తెలుగుదేశం నేతలే ఉన్నారనీ, ఆ పార్టీకి చెందినవారే ఇలాంటివారు కావడం వల్ల నేరాలకు అదుపులేకుండా పోతోందనీ, అందుకే శిక్షలు వెయ్యలేకపోతున్నారనీ, ‘చంద్రబాబూ.. ఇలాంటి పరిస్థితికి కారణం మీరు కాదా’ అంటూ జగన్ మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై దౌర్జన్యాలు, అత్యాచారాలు జరుగుతున్నాయని జగన్ అన్నారు. ఈ ఘటనలకు పాల్పడుతున్నవారిలో ఎక్కువమంది టీడీపీ నేతలే అని ఒకటికి రెండుసార్లు ఆరోపించారు.
దాచేపల్లిలో చోటుచేసుకున్నది అత్యంత దారుణమైన ఘటన. దానికి బాధ్యుడైన సుబ్బయ్యను శిక్షించి తీరాల్సిందే. రాజకీయ నాయకులు ఎవరైనా ఈ సమయంలో ఇలానే స్పందిస్తారు. కానీ, జగన్ స్పందనలో రాజకీయ కోణం చాలా స్పష్టంగా తొంగి చూస్తోంది. ఈ ఘటనను ఖండిస్తూ… ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నవారు అత్యధికులు టీడీపీవారే అని జగన్ అంటున్నారు. అంటే, ఇలాంటి సమయంలో కూడా టీడీపీపై విమర్శించే కోణాన్నే జగన్ వెతుక్కుంటున్నారు. నిజానికి, ఇలాంటి కీచకులు ఏ పార్టీలకు చెందినవారైనా క్షమించే పరిస్థితి ఉండదు. దేశవ్యాప్తంగా ఇలాంటి విపరీత ధోరణలు ఇటీవలి కాలంలో చూస్తున్నాం. ఈ సమయంలో చట్టాలను మరింత కట్టుదిట్టం చేయాలని, శిక్షలు మరింత తీవ్రంగా, త్వరితగతిన ఉండేలా చర్యలు ఉండాలని డిమాండ్ చేయాలి. అంతేగానీ, సదరు నిందితుడు ఏ పార్టీకి ఓటేశాడు, వాడి ఇంటిముందు ఏ రంగు జెండా ఉందని చూడటం అనేది… ప్రతీదాన్లో రాజకీయం చూసే సహజ లక్షణాన్ని పదేపదే బయటపెట్టుకున్నట్టు అవుతుంది.