ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర… రాష్ట్ర రాజకీయాల్లో ఇదో పెద్ద ఈవెంట్. ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టి నెలరోజులు గడిచిపోయాయి. ఈ యాత్రను వైకాపా ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టి మరీ వైకాపా నేతలు యాత్ర ఏర్పాట్లలో తలమునకలౌతున్నారు. అయితే, ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఇతర ప్రముఖ మీడియా ఛానెళ్లలో కూడా జగన్ ప్రత్యేక ఇంటర్వ్యూలు ప్రసారమైతే బాగుంటుందనే ఆలోచన జగన్ బృందానికి వచ్చిందట..! దాంతో ఓ ప్రముఖ టీవీ ఛానెల్ ను సదరు బృందం సంప్రదించిందని విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని చెప్పగానే ఏ మీడియా మాత్రం ఎందుకు కాదంటుంది చెప్పండీ! ‘సాక్షి’ అడగలేని ఎన్నో విషయాలను అడిగేసి.. బోలెడంత టీఆర్పీ తెచ్చేసుకోవచ్చు కదా. ఆ ఛానెల్ వారు కూడా ముందు ఇలానే అనుకున్నారట! కానీ, ‘ఆయన ఇంటర్వ్యూ ఇస్తారు, ఈ ప్రశ్నలు మాత్రం అడగొద్దు’ అని జగన్ బృందం చెప్పేసరికి.. టైట్ క్లోజ్ లో వారి రియాక్షన్ మరోలా ఉందని సమాచారం.
ఇంతకీ, జగన్ ని అడగకూడని సదరు ప్రశ్నావళి ఏమనగా… ఆయనపై ఉన్న కేసుల గురించీ, అవినీతి ఆరోపణల గురించి అడగకూడదట! వైకాపాలోని అంతర్గత వ్యవహారాలపైనా, రాజకీయాలపైనా ప్రశ్నించరాదట. భారతీయ జనతా పార్టీ గురించి, ఆ పార్టీతో సంబంధాలపై ఆయన అభిప్రాయం కోరకూడదట! జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన దగ్గర ప్రస్థావించరాదట! ఈ అంశాలు మినహా, మిగతా వాటిపై జగన్ మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారని సదరు బృందం చెప్పిందట. ఇతర అంశాలంటే ఇంకేం మిగులున్నాయ్… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు, టీడీపీ నాలుగేళ్ల పాలనపై విమర్శలు, మరో ఏడాదిలో అధికారం చేపడితే వైకాపా పాలన ఎలా ఉంటుందో అనే అంశాలు అడిగితే అనర్గళంగా మాట్లాడేస్తారన్నమాట!
అంటే, ఇతర మీడియా నుంచి వైకాపా కోరుకుంటున్నది కూడా జగన్ భజన మాత్రమే! పాదయాత్ర అద్భుతం, ప్రజాస్పందన అపూర్వం, హామీలు అనిర్వచనీయం.. అంటూ కీర్తించాలన్నమాట. అదే పనిలో సొంత మీడియా సంస్థ ఉంది కదా. జగన్ ను నొప్పింపక, తానొవ్వక, ఇబ్బందికర అంశాలను తప్పించి, ఆయన్ని ధన్యుడని చేసే సుతిమెత్తిని ప్రశ్నలు వేసే పాత్రికేయం అక్కడ ఉంది కదా. కనీసం ఇతర మీడియా సంస్థలకు ఇచ్చే ఇంటర్వ్యూల్లోనైనా సాధారణ ప్రజలు ఆశిస్తున్న అంశాలపై జగన్ స్పందన కోరొద్దంటే ఎలా..? భాజపాతో వైకాపా సంబంధాలపై కొన్ని అనుమానాలు ఎప్పట్నుంచో ఉన్నాయి. పవన్ విమర్శలపై జగన్ స్పందన ఏంటనేది ఆ పార్టీ కార్యకర్తలకైనా తెలియాలి. సరే, కేసులు విచారణ దశలో ఉన్నాయి కాబట్టి, వాటి గురించి మాట్లాడొద్దని అనుకున్నా… ఈ నేపథ్యంలో జగన్ మానసిక పరిస్థితి ఏంటనేది సగటు అభిమాని తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఉంటాడు కదా. జగన్ తో ఇంటర్వ్యూ అనుకున్నప్పుడు ఇవన్నీ చాలా ప్రాథమికమైన ప్రశ్నలు అవుతాయి. ఇవి కూడా అడగొద్దని ముందే షరతు పెడితే…ఎవరు మాత్రం ఏం చేస్తారు..? దీంతో, ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రతిపాదనపై ఆ ప్రముఖ ఛానెల్ కాస్త ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది.
విలువలతో కూడిన రాజకీయాలు అంటారు. పాలనలో విశ్వసనీయత తెస్తామంటారు. వారు కోరుకుంటున్న ఆ విలువలు ప్రజలకు తెలియాలంటే.. విఫులంగా మాట్లాడాలి. ఆ విశ్వసనీయత అనేది ఏదైతే ఉందో, అది ప్రజలకు అర్థం కావాలంటే విమర్శల్ని స్వాగతించాలి, వాటిపై హుందాగా స్పందించాలి. వివరణ ఇవ్వాలి. ఇక, విలువలతో కూడిన జర్నలిజం మాది అని కూడా వారే అంటుంటారు! ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇన్ని కండిషన్లు పెడితే.. జర్నలిజానికి వారు ఇస్తున్న విలువ ఎక్కడుంది..?