ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే అని వైకాపా అంటోంది. జరిగింది కత్తి దాడి కాబట్టి.. దీన్ని సహజంగానే హత్యాయత్నం కోణం నుంచే పోలీసులు దర్యాప్తు చేస్తారు, జరుగుతున్నదీ అదే. కానీ, ప్రతిపక్ష పత్రిక సాక్షి అనుమానాలు ఏంటంటే… కేసు మొత్తాన్ని శ్రీనివాసరావుపై మాత్రమే నెట్టే ప్రయత్నం మాత్రమే పోలీసుల చేస్తున్నారంటూ ఓ కథనం నేటి పత్రికలో రాశారు. శ్రీనివాసరావు వెనక ఎవరున్నారు, ఎవరి ప్రోత్సాహంతో దీన్ని చేశారు అనే కోణాన్ని పోలీసులు విస్మరిస్తున్నారంటూ ఓ కథనంలో పేర్కొంది. ఈ తీరుపై న్యాయ నిపుణులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారని రాసేశారు! రిమాండ్ రిపోర్టులో అసలు అంశాలు ప్రస్థావనకే రాలేదంటూ విచారణ తీరుపై కూడా విమర్శలు చేస్తున్నారు.
ఇక, వైకాపా నేతల సంగతి అయితే సరేసరి! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రధాన కుట్రదారుడు అంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఓపక్క కేసు పోలీసులు దర్యాప్తు చేస్తున్నా, విషయం కోర్టు వరకూ వెళ్లిపోయినా, జగన్ దాడి ఘటనపై వైకాపా నేతలు మాత్రం సొంత తీర్పులు ఇచ్చేస్తున్నారు. దర్యాప్తుపై నమ్మకం లేదనీ, స్వతంత్ర దర్యాప్తు సంస్థకు కేసు దర్యాప్తు అప్పగించాలంటూ వారూ విమర్శలు చేస్తున్నారు. నిజానికి, ఇప్పటికే ఇదే అంశంలో జగన్ కూడా ఇదే మాటన్నారు. ఆసుపత్రిలో ఉండగా పోలీసులు వస్తే… వారికి సహకరించలేదు. దీంతో… ఇంతకీ జగన్ కి దేనిపై నమ్మకం ఉంటుంది, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను ఆయన నమ్మరా అనే చర్చ మళ్లీ తెరమీదికి వస్తోంది.
వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించిన సంగతి తెలిసిందే. గడచిన సమావేశాలకు రమ్మంటూ అధికార పార్టీ ఆహ్వానించినా కూడా.. తనకు సభపై నమ్మకం లేదనీ, రాలేనని జగన్ స్పష్టం చేశారు. బాధ్యతగల ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ చట్టసభపై నమ్మకం లేదని చెప్పడమేంటో వారికే తెలియాలి! ఇక, ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడితే… అప్పుడూ ఇంతే, టీడీపీ మీద నమ్మకం లేదనేశారు. వారూ ప్రత్యేకహోదా కోసమేగా పోరాడేది..? అసెంబ్లీని నమ్మరు, ఆంధ్రా పోలీసుల్ని నమ్మరు, ఆంధ్రా డాక్టర్లను నమ్మరు, ఆంధ్రాలో అధికార పార్టీ చేసే ప్రయత్నాలను నమ్మరు… ఇంతకీ జగన్ దేన్ని నమ్ముతారు అనే చర్చ మరోసారి మొదలైంది. అసెంబ్లీని బహిష్కరిస్తామంటూ అప్పట్లో జగన్ తీసుకున్న నిర్ణయం సెల్ఫ్ గోల్ అని సొంత పార్టీ వర్గాలే అభిప్రాయపడ్డ సందర్భాలున్నాయి. ఇప్పుడు ఈ దాడి విషయంలో సెల్ఫ్ గోల్ దిశగానే వైకాపా నేతలు, సాక్షి పత్రిక కూడా నడుస్తోంది. వారికి కావాల్సిందల్లా ఒక్కటే… ఇది ముఖ్యమంత్రి చేసిన కుట్రగా చూపించే ప్రయత్నం! దీని వల్ల రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం.