వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా లేళ్ల అప్పిరెడ్డిని తప్పించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. వైసీపీలోనే కాదు.. టీడీపీలో కూడా హాట్ టాపిక్ అయింది. ఏసురత్నం మాజీ పోలీసు అధికారిని సమన్వయకర్తగా నియమించడమే కాదు.. ఆయన అభ్యర్థి అని నేరుగా చెప్పేశారట. దీంతో అసలు ఎవరు ఈ ఏసురత్నం..? ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారన్న చర్చ సహజంగానే ప్రారంభమయింది. నిజానికి ఏసురత్నానికి గెలవడానికి కాకుండా ఓడిపోవడానికే జగన్ అభ్యర్థిగా నిలుపుతున్నారు. టీడీపీని గెలిపిస్తారా.. ? అన్న సందేహం రావొచ్చు కానీ.. ఆయన గెలిపించాలనుకుంటున్నది బీజేపీ అభ్యర్థిని. కన్నా లక్ష్మినారాయణను. వైసీపీ అగ్రనేతల్లో కూడా ఇప్పుడు ఇదే చర్చ.
గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున కన్నా లక్ష్మీ నారాయణ పోటీ చేశారు. ఇరవై వేల ఓట్ల వరకూ తెచ్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అసెంబ్లీలో ఉండాలనుకుని.. వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. కానీ “బీపీ” రావడంతో ఆగిపోయారు. “బీపీ” రావడానికి వైసీపీ, బీజేపీ మధ్య అంతర్గత రాజకీయాలు కారణమన్న ప్రచారం కూడా జరిగింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసినా.. వైసీపీ సాయంతో గెలిపిస్తామన్న హామీ.. ఢిల్లీ నుంచి వచ్చినందునే.. కన్నా బీజేపీలోనే ఉండిపోయారన్న విషయం ఇప్పుడు బయటకు వస్తోంది. ఆయన గెలవాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు బలహీనమైన అభ్యర్ధిని రంగంలోకి దించాలని, లోపాయికారి ఒప్పందం ఉందని ఇప్పుడు క్లారిటీ వస్తోంది. ఇందులో భాగంగానే బలంగా లేళ్ళ అప్పిరెడ్డిని తొలగించి .. రాజకీయం తెలియని ఏసురత్నాన్ని నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నియమించారు.
కన్నాను గెలిపించడానికి జనసేన కూడా లోపాయికారీగా సాయం చేయబోతోందట. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ తరపున కమ్మ లేదా కాపు సామాజిక వర్గం నుంచి అభ్యర్దిని రంగంలోకి దించితే.. జనసేన నుంచి కూడా అదే సామాజికవర్గానికి చెందిన అభ్యర్దిని బరిలోకి దించాలని నిర్ణయించారట. దీని వల్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్దికి పడే ఓట్లు చీలిపోతాయనే వ్యూహం దాగి ఉంది. ఇందుకోసం ముగ్గురి మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని తెలుగుదేశం నేతలు అనుమానిస్తున్నారు. పరిస్తితి చూస్తూంటే.. ఇదేమీ తీసి పడేసే రాజకీయ వ్యూహం అనిపించడం లేదు. ఎందుకంటే.. కన్నా లక్ష్మినారాయణ.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా .. ఇప్పటి వరకూ చంద్రబాబుపై తిట్ల దండకం వినిపించడమే కానీ… జగన ను కానీ.. పవన్ ను కానీ పల్లెత్తు మాట అనలేదు.