ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి ఐ అండ్ పీఆర్ విడుదల చేసే ఫోటోలు, వీడియోల్లో మౌలికమైన మార్పు కనిపిస్తోంది. అదేమిటో చాలా మందికి మొదట అర్థం కాలేదు కానీ..తర్వాత అర్థం అయిందేమిటంటే…ఎప్పుడూ.. ఆయన వెనుక కనిపించే.. పూర్ణ వికసిత పద్మం లేదు. రాత్రికి రాత్రి దాన్ని తీసేసి.. గోడకు తెల్ల రంగు వేసేశారు. ఖాళీగా ఉంటే బాగుండదనుకున్నారేమో కానీ… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నాన్ని తెచ్చి పెట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్మీట్లు పెట్టినా… సమీక్షలు చేసినా… ఆయన బ్యాక్గ్రౌండ్లో.. బంగారు రంగులో మెరిసిపోయే.. ఓ పూర్ణ వికసిత పద్మం ఆకారంలో.. ఓ ఆర్ట్ ఉంటుంది. నిజానికి సచివాలయంలో ముఖ్యమంత్రి కేబినెట్ భేటీలు .. ఇతర కీలక సమావేశాలు నిర్వహించే హాల్లో అది ఉంటుంది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. అమరావతిని రాజధానిగా నిర్ణయించిన తర్వాత… ఆ పూర్ణ పద్మానికి రూపకల్పన చేశారు. అమరావతికి ఉన్న చారిత్రక ప్రాధాన్యం… బౌద్ధుల చరిత్రను గుర్తు చేసేలా దాన్ని రూపొందించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి .. చంద్రబాబు ముద్ర లేకుండా.. చాలా వాటిని లేకుండా చేసే ప్రయత్నం చేశారు కానీ… దాని జోలికి వెళ్లలేదు. పైగా.. తనకు బాగా నచ్చిందేమో కానీ.. క్యాంప్ ఆఫీసుగా మార్చుకున్న తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న సమావేశమందిరంలోనూ.. అదే చిహ్నాన్ని పెట్టుకున్నారు.
అయితే.. కొన్ని రోజులు బాగానే ఉన్నా.. హఠాత్తుగా.. క్యాంప్ ఆఫీసులోని.. తన సమావేశమందిరం నుంచి దాన్ని తొలగించారు. దీనికి కారణాలేమిటన్నదానిపై ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. జ్యోతిష్యులు చెప్పారని కొందరు… మరో నమ్మకం కారణమని మరికొందరు చెబుతున్నారు. ఆ చిహ్నాన్ని సెక్రటేరియట్లోనూ తీసేయాలని నిర్ణయించుకున్నారని.. అందుకే ముందుగా.. క్యాంప్ ఆఫీసులో తీసేశారని.. మరికొందరు చెబుతున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, దృశ్యాల్లో అమరావతి వైభవం చాటేలా ఉండే.. ఆ పూర్ణ వికసిత పద్మం ఇక కనిపించకపోవచ్చు.