సంక్షేమ పథకాల కింద తాము ప్రజలకు డబ్బులు జమ చేస్తున్నామని.. వాటిని పాత రుణాలకు జమ చేసుకోవద్దని..బ్యాంకర్లను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఎస్ఎల్బీసీ మీటింగ్ సాధారణంగా రుణ లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి నిర్వహిస్తారు. అయితే.. జగన్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్‌లో మాత్రం.. ప్రభుత్వానికి సంబంధించిన .. బ్యాంకులకు సంబంధం లేని అంశాలే ఎక్కువగా మాట్లాడారు. ముఖ్యంగా.. నవరత్నాల పేరుతో.. ప్రజలకు డబ్బుల పంపిణీ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. మొదటగా.. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు .. నెలాఖరులో రూ. పదివేలు ఇస్తామని ప్రకటించారు. తర్వాత వచ్చే నెల మొదటి వారానికి మార్చారు. ఆ తర్వాత రైతు భరోసా కింద రైతులకు రూ. 12,500 విడుదల చేయనున్నారు. వీటిని బ్యాంకర్లు.. పాత బాకీల కింద జమ చేసుకుంటే.. తమకు రావాల్సిన మైలేజీ రాదని.. జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.
అందుకే.. బ్యాంకర్ల సమావేశంలో దీన్నే ప్రధానంగా ప్రస్తావించారు. బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డబ్బును మినహాయించొద్దన్నారు. సున్నా వడ్డీ రుణాలను రైతులు, డ్వాక్రా సంఘాలకు విరివిగా ఇవ్వాలని… బ్యాంకర్లకు ఎలాంటి సాయం చేయాలన్నా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. సమావేశంలో జగన్ బ్యాంకర్లకు తమ సంస్కరణల గురించి కూడా వివరించారు. జ్యుడిషియల్, రివర్స్ టెండరింగ్ చర్యల వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు. పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.782 కోట్లు ఆదా చేశామన్నారు. దేశంలో ఎవ్వరూ ఇలాంటి విప్లవాత్మక చర్యలు చేపట్టలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయని… పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వెనకడుగు వేస్తున్నారని జగన్ బ్యాంకర్లకు చెప్పారు. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిస్తేనే క్రెడిబిలిటీ నిలబడుతుందన్నారు.
పథకాల అమలు కోసం… కార్యాచరణ రూపొందించుకున్న ఏపీ సీఎంకు… ననిధుల లభ్యత ఓ సవాల్‌గా మారితే.. అది నేరుగా… ఖాతాదారులకు చేరేలా చేసుకోవడం మరో సవాల్ గా మారింది. తాము ఇచ్చే డబ్బులను… బ్యాంకర్లు మినహాయించుకుంటే.. ప్రజల్లో మంచి పేరు రాకపోగా… మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో బ్యాంకర్లు ఎలా.. వ్యవహరిస్తారనేది కీలకం. వారికి అప్పులు వసూలు కావడమే లక్ష్యం కాబట్టి.. ఈ విషయంలో బ్యాంకర్లు ఇప్పటికి సరే అన్నా.. మొండి బకాయిలను వసూలు చేసుకోవడానికే… వాటిని మినహాయించుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.