అసెంబ్లీకి రావడానికి ఆసక్తిగా లేని జగన్ తాను ఎంపీగా వెళ్లాలని అనుకుంటున్నారని కడపలో గాసిప్ ప్రారంభమయింది. అవినాష్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యేగా చేసి.. కడప ఎంపీగా తాను వెళ్లడానికి ఇద్దరూ రాజీనామాలు చేసి ఉపఎన్నికలకు రెడీ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమయిందో తెలియదు కానీ వైసీపీ వర్గాలు కూడా నిజమే అన్నట్లుగా చెప్పుకుంటున్నాయి.
నిజానికి కాస్తంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా ఇది పిచ్చితనం అవుతుందని అనుకుంటారు. ఎందుకంటే ప్రస్తుతం కూటమి తిరుగులేని మెజారటీతో అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో పులివెందులలో ఎంత మెజార్టీతో జగన్ గెలిచారు… పార్లమెంట్ లో కూడా అవినాష్ రెడ్డికి అంతే మెజార్టీ వచ్చింది. షర్మిల ఇంకాస్త ఎక్కువ ఓట్లు చీల్చి ఉంటే… అవినాష్ రెడ్డి కూడా ఓడిపోయి ఉండేవారు. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉపఎన్నికలంటే ఇక చెప్పాల్సిన పని లేదు.
సీనియర్ రాజకీయ నాయకుడు… సీఎంగా ఉండగా ఎన్నికలు ఎలా నిర్వహించాలో కూడా చూపించిన జగన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు సీఎంగా ఉండగా ఉపఎన్నికలకు వెళ్తారని ఎవరూ అనుకోరు. నంద్యాల ఉపఎన్నికల సమయంలో ఆయన ఇరవై రోజల పాటు గల్లీ గల్లీలో తిరిగినా పాతిక వేల ఓట్లకుపైగా తేడాతో ఓడిపోయారు. అందుకే ఇదంతా ఫాల్స్ న్యూస్ అని జగన్ రెడ్డి.. రాజీనామాలు అంటూ… పిచ్చి రాజకీయాలు చేయరని వైసీపీ నేతలు గట్టిగా అనుకుంటున్నారు. కానీ వంద శాతం కాదు. ఎదుకంటే జగన్ రెడ్డి అలాంటి రాజకీయాలు చేసే … పదకొండుకు పడిపోయారు మరి.. !