జగన్ రెడ్డి వస్తాడు.. అసెంబ్లీలో ఓ ఆటాడతాడు .. టైగర్ ఈజ్ బ్యాక్ అంటూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎలివేషన్లు వేసుకున్నంత సేపు పట్టలేదు.. జగన్ వారి గాలి తీసేయడానికి . అసెంబ్లీకి పోయేది లేదని ఆయన తేల్చేశారు. పైగా అక్కడకు పోయి ఎదురెదురుగా కుస్తీపట్టేది ఏమీలేదని.. తాను తన ఇంట్లో కూర్చొనే ప్రశ్నిస్తా.. సమాధానం చెప్పాలని చెప్పుకొచ్చారు. ఆయన తీరు చూసి ప్రశ్న అడిగిన వారు కూడా ఆశ్చర్యపోయారు. అసెంబ్లీ అంటే ఈ మాజీ ముఖ్యమంత్రికి కనీస అవగాహన కూడా లేదా అని అనుకున్నారు.
ఆయన ప్రతిపక్ష నేతే. కాదని ఎవరూ అనడం లేదు. అయితే పది శాతం సీట్లు లేకపోతే ప్రధాన ప్రతిపక్షనేతగా గుర్తించి కేబినెట్ హోదా ఇవ్వరు.అందుకే పదేళ్లు రాహుల్ గాంధీ ప్రతిపక్షనేతగా లేరు. ఇప్పుడు పది శాతం సీట్లు కన్నా కాంగ్రెస్ కు ఎక్కువ వచ్చాయి కాబట్టి ఆయన ప్రతిపక్ష నేత అయ్యారు. కానీ జగన్ కు పది శాతానికి చాలా దూరంలో సీట్లు ఆగిపోయాయి. అయినా సరే ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని లేకపోతే రానని ఆయన మంకుపట్టు పట్టారు.
అయితే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్లో ఏ మూలో జగన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారన్న ఆశ ఉండేది. లేకపోతే వెళ్తారని ప్రచారం చేస్తే వెళ్తారని ఆశపడ్డారో కానీ.. జగన్ లండన్ నుంచి రాగానే బడ్జెట్ సమావేశాలకు వెళ్తారన్న ప్రచారం ప్రారంభించారు. కానీ జగన్ మాత్రం అలాంటి ఆలోచన లేదని.. అక్కడ కుస్తీలు జరిగితే తాను తట్టుకోలేనని డైరక్ట్ గా చెప్పేశారు. తమ నాయకుడి గురించి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఓ క్లారిటీ వచ్చి ఉంటుంది.