జగన్ పాదయాత్ర పునః ప్రారంభమైంది. విశాఖపట్నం ఎయిర్ పోర్టు లో జగన్ పై దాడి జరిగిన తర్వాత దాదాపు 17 రోజుల పాటు విరామం తీసుకున్న జగన్ ఈరోజు తన పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. అయితే ఈసారి పాదయాత్ర భారీ భద్రత మధ్య కొనసాగనుంది. విజయనగరం జిల్లా మేలపు వలస నుంచి జగన్ పాదయాత్ర ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది.
జగన్ కు భారీ భద్రత కల్పించిన ప్రభుత్వం, దాదాపు 150 మంది పోలీసులను జగన్ కు సెక్యూరిటీ గా ఇచ్చింది. ఈ 150 మందికి తోడుగా జగన్ వ్యక్తిగత సిబ్బంది మరో 50 మంది సెక్యూరిటీ గా ఉంటారు. దీనికి తోడు డ్రోన్ కెమెరా లతో జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ ను సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షిస్తారు. అలాగే జగన్ బసచేసే క్యాంపు చుట్టూ కూడా సీసీ కెమెరాలని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే మూడంచెల భద్రత మధ్య జగన్ పాదయాత్ర కొనసాగనుంది.
ఏది ఏమైనా, తమ పైకి విమర్శ రాకుండా ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా చేస్తోంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న భద్రత ఏర్పాట్ల కంటే మరింత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కలిగిన విమానాశ్రయంలోనే జగన్ పై దాడి ఘటన జరిగిందని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.