ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కొత్త మద్యం విధానం ప్రవేశపెట్టింది. ప్రైవేటు మద్యం దుకాణాలు రద్దు చేశారు. ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంది. ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే అమ్మకాలు జరిపేలా ఆదేశాలిచ్చారు. ఇది మద్య నియంత్రణకు మొదటి అడుగు. ఈ పద్దతి సక్సెస్ అయింది. అమ్మకాలు తగ్గిపోయాయి. అయితే.. రాత్రి ఎనిమిది తర్వాత ఆంధ్రప్రదేశ్లో మద్యం అన్నిచోట్లా దొరుకుతోంది. అయితే ప్రభుత్వ దుకాణాల్లో కాదు. అక్రమ మద్యం కూడా కాదు. ప్రభుత్వానికి టాక్స్ కట్టి లైసెన్స్ తో అమ్ముతున్న మద్యమే. బార్లలో ఆ మద్యం లభిస్తోంది. బార్లకు రాత్రి పదకొండు వరకూ పర్మిషన్ ఉంది. లిక్కర్ లేకుండా… ఫుడ్ సర్వ్ చేస్తూ 12 గంటల వరకూ తెరిచి ఉంచుకోవచ్చు. అంటే.. మద్యం నిరంతరాయంగా బార్ల ద్వారా మందుబాబులకు అందుతూనే ఉందన్నమాట. అందుకే ఈ బార్లనూ కట్టడి చేయాలని జగన్ నిర్ణయించారు. జగన్ ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్ అమలు చేయబోతున్నారు.
బార్లకు అనూహ్యంగా కస్టమర్లు పెరిగిపోయారు. ఏపీలో మొత్తం 840 బార్లు ఉన్నాయి. ఇప్పటివరకూ ప్రైవేటు మద్యం షాపులు ఉండటం వల్ల బార్లకు వెళ్లేవారి సంఖ్య పరిమితంగా ఉండేది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం నడుపుతున్న మద్యం షాపులు రాత్రి 8గంటలకే మూతపడటంవల్ల ఆ తర్వాత బార్లను ఆశ్రయిస్తున్నారు. షాపుల్లో పర్మిట్ రూమ్లు లేకపోవడంతో కొందరు బార్లవైపే చూస్తున్నారు. బార్లలో ధర ఎంతైనా నిర్ణయించొచ్చు. ఇటీవల కొత్త పాలసీ తర్వాత ప్రభుత్వం మద్యం ధరలను సుమారు 20శాతం పెంచింది. ఇదే అదనుగా బార్ల వ్యాపారులు ధరలను 40శాతం పెంచేశారు. మందుబాబులకు ప్రత్యామ్నాయం లేక ధర ఎంతైనా వాటికే వెళ్తున్నారు..
షాపుల తరహాలో సిట్టింగ్ లేకుండా వెంటనే తాగి వెళ్లిపోయేలా కొత్తగా స్పీడ్ బార్ విధానాన్ని తీసుకొచ్చారు. మద్యం షాపుల్లో సిట్టింగ్ రూముల్లా వీటిని బార్లకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్నారు. బార్ అంటే నిబంధనల ప్రకారం మద్యంతో పాటు ఫుడ్ అందుబాటులో ఉండాలి. కానీ ఏపీలో బార్ అంటే.. మద్యం తాగడానికే అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇప్పుడు… కొత్తగా.. ఎనిమిది గంటల తర్వాత బార్ల యజమానులు నిబంధనలకు విరుద్ధంగా.. బాటిళ్లు అమ్మేసుకుంటున్నారు. ఈ వ్యవహారాలన్నీ ప్రభుత్వం దృష్టికి రావడంతో.. బార్లక్కూడా సమయపాలన విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కానీ అదంత తేలిక కాదు. వారికి 2022 వరకూ లైసెన్స్ ఉంది. అయితే.. కష్టనష్టాలు ఎదురైనా సరే.. బార్లను కట్టడి చేసి.. మద్య నియంత్రణ చేసి తీరాలన్న పట్టుదలతో జగన్ ఉన్నారు.