వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆకస్మికంగా ముగిసింది. నారాయణ అనే తన వ్యక్తిగత సహాయకుడు మరణించడంతో.. బాధాతప్త హృదయంతో..ఆయనకు నివాళి అర్పించడానికి ఢిల్లీలో అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని జగన్ కడపకు పయనమయ్యారు. నారాయణ కుటుంబంతో.. వైఎస్ కుటుంబానికి మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. ఢిల్లీ నుంచి నేరుగా కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడ్నుంచి నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లెకు వెళ్తారు. నివాళి అర్పించి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. ఆ తర్వాత మళ్లీ అమరావతి చేరుకుంటారు.
గురువారం ఉదయం.. అనంతపురం జిల్లా పెనుకొండలో కియా పరిశ్రమను ప్రారంభించిన జగన్… హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లారు. హోంమంత్రి అమిత్ షా.. ప్రధాని మోడీ అపాయింట్మెంట్లు ఖరారయ్యాయన్న సమాచారం రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లినట్లు చెబుతున్నారు. తీరా ఢిల్లీకి వెళ్లే సరికి… ఎవరిక అపాయింట్మెంట్లు ఖరారు కాలేదు. అర్థరాత్రి వరకూ ఎదురు చూసినప్పటికీ.. అమిత్ షా ఇంటి గేట్లు తెరుచుకోలేదు. ఈ రోజు.. ప్రధాని మోడీతో సమావేశం ఉందని… వైసీపీ వర్గాలు ప్రచారం చేశాయి. ఆయన కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన, అమ్మఒడి పథకాల ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తారని చెప్పుకొచ్చారు. అయితే.. మోడీ అపాయింట్మెంట్ కూడా ఖరారు కాలేదని తెలుస్తోంది. అదే సమయంలో.. సహాయకుడు నారాయణ మృతి వార్త తెలియడంతో.. కడపకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ పర్యటనలు.. అచ్చి రావడం లేదు. ఆయన ఎవరినైతే కలవాలని అనుకంటున్నారో.. వారందరూ చివరి క్షణంలో హ్యాండిస్తున్నారు. గతంలో ఢిల్లీ పర్యటనల్లోనూ అదే జరిగింది. తాజాగా అదే జరిగింది. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి సరైన టీమ్‌ను పెట్టుకోలేకపోయారని చెబుతున్నారు. విజయసాయిరెడ్డి చేసిన కొన్ని ప్రకటనలు, పనుల వల్ల.. కేంద్రమంత్రులు ఆయనను దగ్గరకు రానివ్వడం లేదు. ఆయన పలుకుబడి పూర్తిగా తగ్గిపోవడం.. జగన్‌కు మైనస్‌గా మారింది.