“చంద్రబాబు సినిమా చూపిస్తున్నారు..”
పోలవరం సినిమా చూపిస్తున్నారు..!
పట్టిసీమ, పురుషోత్తల పట్నం సినిమా చూపించారు..!
అమరావతి సినిమా చూపిస్తున్నారు..!
“సినిమాకెళ్తే హీరోని అభిమానిస్తాం.. అలాగే కేసీఆర్ను అభిమానిస్తా..” …
ఈ సినిమా మాటలన్నీ… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్నోహన్ రెడ్డి, ఆయన పార్టీకి చెందిన మీడియా సాక్షి లో వచ్చిన మాటలే. ఇటివలి కాలంలో.. ఏపీలో ఏం జరిగినా.. అదో సినిమాగా .. ప్రకటించేస్తారు. చంద్రబాబు ప్రజలకు సినిమా చూపిస్తున్నారంటూ హడావుడి పడిపోతున్నారు. పోలవరం పనుల్లో పురోగతి కళ్లముందు కనిపిస్తున్నా… అమరావతిలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నట్లు దృశ్యాలు కనిపిస్తున్నా… వాటిని నమ్మడానికి జగన్మోహన్ రెడ్డి కానీ… ఆయన పత్రిక సాక్షి కానీ ఏ మాత్రం అంగీకరించడం లేదు. వాటిని సినిమాగా సంబోధిస్తున్నారు. ఉత్తుత్తి పనులను అనుకుంటున్నారు. అదే మాటలను.. ప్రజలు చెప్పడానికి పత్రికలో అచ్చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.
తాజాగా.. అమరావతిలో ఐకానిక్ నిర్మాణాల ఆకృతులతో… ఓ గ్యాలరీని నిర్మించాలని నిర్ణయించారు. దీన్ని గురువారం చంద్రబాబుతో కలిసి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రారంభించబోతున్నారు. దీన్ని కూడా ఓ సినిమాగా అభివర్ణించడం ప్రారంభించింది సాక్షి. ప్రజలను మభ్య పెట్టడానికేనట. అమరావతిలో నిర్మించబోతున్న భవనాల ఆకృతుల్ని ప్రదర్శించడం మభ్యపెట్టడం … సినిమా చూపించడం ఎలా అవుతుందో సాక్షికే తెలియాలి. స్టార్టప్ ఏరియా అభివృద్ధి బాధ్యతను.. సింగపూర్ ప్రభుత్వం తీసుకుంది. ఆ సంస్థే వెల్కం గ్యాలరీని ఏర్పాటు చేస్తోంది. తాము స్టార్టప్ ఏరియాలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోతున్నామో ప్రజలకు తెలియజేసేందుకు.. ఈ వెల్కం గ్యాలరీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
రాజధానికి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికి.. అమరావతిలో రోజుకు యాభై వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. అయినపప్పటికీ.. వైసీపీ అక్కడ ఒక్క ఇటుక కూడా పడలేదని ప్రచారం చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.సాక్షి మీడియా కూడా… తన అధినేత పార్టీకి కావాల్సినంతగా “అచ్చు” సాయం చేస్తోంది. సాధారణంగా జర్నలిజం అంటే.. జరిగిన ఘటన గురించి… పాజిటివ్గానో .. నెగెటివ్గానో విశ్లేషించవచ్చు. కానీ సాక్షి మాత్రం.. అసలు అక్కడ జరుగుతున్న విషయాలను దాచి పెట్టి.. అదంతా సినిమాలుగా ప్రజెంట్ చేస్తోంది. దీని వల్ల వారు సాధించేదేమిటోకానీ.. సొంత పాఠకులు కూడా..అసలైన సమాచారం కోసం ఇతర పత్రికలు చూడాల్సిన పరిస్థితి వస్తుంది.