హైదరాబాద్: అధికారంలోకి రాగానే మద్య నిషేధం విధిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆయన ఇవాళ విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కల్తీమద్యం బాధితులను, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, మద్యనిషేధం విధించాలని డిమాండ్ చేశారు. బీహార్లో నితీష్ కుమార్ విధించినట్లు ఏపీలో మద్య నిషేధం ఎందుకు విధించలేదని ప్రశ్నించారు. కల్తీమద్యం ఘటనకు బాధ్యత వహించి ప్రభుత్వం చెవులు పట్టుకుని గుంజీలు తీయాలని అన్నారు. ఇంతవరకు పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ రాలేదని అన్నారు. రికార్డులను తారుమారు చేయాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో మాట్లాడాల్సిరావటం బాధాకరమని వ్యాఖ్యానించారు. మద్యం షాపులు ఇంత విచ్చలవిడిగా, ఉదయాన్నే ఆరుగంటలకే తెరుస్తున్నారని ఆరోపించారు. రాత్రి ఒంటిగంటా, రెండు, మూడు దాకాకూడా నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వమే ప్రజలతో తాగిస్తోందని ఆరోపించారు. వ్యవస్థ ఎలా బాగుపడుతుందని అడిగారు. కల్తీ మద్యానికి బాధ్యత ప్రభుత్వానిది కాదా అని అడిగారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్లకే అమ్ముకుంటున్నారని చెప్పారు. దీనికోసం కిందనుంచి ముఖ్యమంత్రిదాకా అందరికీ ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. విచ్చలవిడిగా తాగిస్తున్నారని, మద్యం అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తున్నారని అన్నారు. తనవర్గం వారికే మద్యం తయారీ లైసెన్సులు ఇస్తున్నారని చెప్పారు. ఊళ్ళల్లో ఆడవాళ్ళు తిరిగే పరిస్థితి లేదని. ఊరుకు 15-20 బెల్ట్ షాపులు ఉన్నాయని జగన్ అన్నారు.