ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దాకా, మంత్రుల దగ్గర నుంచి చినబాబు దాకా, చినబాబు దగ్గర నుంచి పెదబాబు దాకా… అంతా లంచాలమయమని టీడీపీ సర్కారును ఉద్దేశించి ప్రతిపక్ష నేత జగన్ విమర్శించారు. ప్రజా సంకల్ప పాదయాత్ర ఏలూరు సమీపంలో 2 వేల కి.మీ. మైలురాయి దాటింది. ఈ సందర్భంగా ఏలూరులో ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడారు. 2014 ఎన్నికల్లో 15కి 15 నియోజక వర్గాల్లో తెలుగుదేశానికి ఓటేసి గెలిపిస్తే, ప్రజలను నిలువునా చంద్రబాబు నాయుడు ముంచేశారని ఆరోపించారు. ఇసుక, మట్టి, బొగ్గు, మద్యం, విద్యుత్ కాంట్రాక్టులు, విశాఖ భూములు, రాజధాని భూములు, గుడి భూములు… ఇలా దేన్నీ వదలకుండా చంద్రబాబు నాయుడు భోంచేస్తున్నారని మండిపడ్డారు.
పాదయాత్ర చేస్తుంటే కొంతమంది ప్రజలు తనని కలిశారనీ, జిల్లాలో 15కి 15 స్థానాల్లో టీడీపీని గెలిపిస్తే, నాలుగేళ్ల తరువాత ఇప్పుడు చూసుకుంటే తమ గుండెల్లో చంద్రబాబు గునపం దించారని అనిపిస్తోందని వారు తనతో చెప్పుకుని బాధపడ్డారని జగన్ చెప్పారు! నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఆయన రూ. లక్షల కోట్ల దోపిడీ చేశారనీ, ఎమ్మెల్యేలు కూడా ఇసుక నుంచి మట్టి దాకా దేన్నీ వదిలిపెట్టడం లేదని ప్రజలను తనకు చెప్పారని జగన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు దీక్షల పేరుతో రోజుకో సినిమా చూపిస్తున్నారనీ, బాబా మాదిరిగా అవతారాలు మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. అవార్డులు ఇచ్చేవారు చంద్రబాబు నటనను చూస్తే ఆయనకి ఉత్తమ విలన్ అవార్డు ఎప్పుడో ఇచ్చేవారని వ్యంగ్యంగా అన్నారు. ‘రేప్పొద్దున్న ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు, కారు ఇస్తానంటాడు, అదీ చాలక మనుషుల్ని పంపించి రూ. 3 వేలు ఇస్తానంటాడు. వద్దనుకుండా ఆ సొమ్ము తీసుకోండి. రూ. 5 వేలు డిమాండ్ చెయ్యండి. కానీ, ఓటు వేసేటప్పుడు మీ మనస్సాక్షిని ఒక్కసారి అడగండి’ అని జగన్ చెప్పారు. ఇక, జిల్లాలోని చింతమనేనితోపాటు ఇతర టీడీపీ నేతల తీరుపై కూడా జగన్ విమర్శలు చేశారు.
రాష్ట్రమంతా అవినీతిమయం అంటూ జగన్ ఈ మధ్య విమర్శిస్తున్నారు. లక్షల కోట్లు ముఖ్యమంత్రి దోచుకున్నారనీ ఆరోపిస్తున్నారు. మట్టి నుంచి అంటూ మొదలుపెట్టి, అన్నింటా అవినీతి అంటారు. ముఖ్యమంత్రిపై ఆస్థాయి ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆధారాలు ఏవైనా చూపితే ఆయన వాదనకు మరింత బలం చేకూరుతుంది కదా! ఇక, ముఖ్యమంత్రి అవినీతిపైనే ప్రధానికి ఫిర్యాదు చేసేందుకు పీఎంవో చుట్టూ తిరుగుతున్నా అంటూ ఆ మధ్య వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అన్నారు. సరైన సమయంలో అన్నీ బయటపెడతామన్నారు. అవేవో బయటపెట్టి, ఆ తరువాత ఆరోపణలు చేస్తే.. టీడీపీకి బదులు చెప్పే అవకాశం లేకుండా పోతుంది కదా!
ఓహో, కేంద్రంలోని భాజపా కూడా ప్రస్తుతం అదే పనిలో ఉంది కదా! ఏపీ సర్కారుపై ఏదో ఒక రకంగా ఎక్కడో ఒకచోట సీబీఐ ఎంక్వయిరీ వేయించాలని ప్రయత్నిస్తోందని కథనాలు బలంగా వినిపిస్తున్నాయి. అంటే, అలాంటిదేదో జరిగితే… ‘ఇదిగో ఇదే మేం మొదట్నుంచీ చెప్పిన సీఎం అవినీతి’ అంటూ అప్పుడు ఆరకంగా స్పందిస్తారేమో..!