“కాంగ్రెస్ అయినా.. బీజేపీ అయినా.. ఎవరైనా.. ప్రత్యేకహోదా ఇచ్చే వారికే మద్దతు… ” ఇదీ జగన్మోహన్ రెడ్డి.. తాజా ప్రకటన. ప్రత్యేకహోదా ఇచ్చే ప్రసక్తే లేదని.. భారతీయ జనతా పార్టీ… సందర్బం వచ్చిన ప్రతీసారి కుండబద్దలు కొడుతోంది. అయినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి.. జాతీయ స్థాయిలో… ప్రత్యేకహోదా ప్రస్తావన వచ్చే సరికి.. బీజేపీకి కూడా లైన్లోకి తీసుకొస్తున్నారు. అసలు ఇచ్చేదే లేదని.. ఆ పార్టీ చెబుతూంటే.. కొత్తగా ఇస్తారు.. ఇస్తే.. రాసివ్వాలి అంటూ.. ఆ పార్టీపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు.. అభిమానం ఒలకబోస్తున్నారో .. ఆ పార్టీ శ్రేణులకు అర్థం కావడం లేదు.
రాజకీయంగా.. ప్రత్యేకహోదా ఎజెండాను సెట్ చేసుకున్నప్పుడు… దానికి తగ్గట్లుగా రాజకీయ వ్యూహాలను అమలు చేసుకోవాలి. హామీలన్నీ అమలు చేస్తామని… హామీలు ఇచ్చి..అధికారంలోకి వచ్చిన బీజేపీ హ్యాండిచ్చింది. అదే సమయంలో అవే హామీలు పార్లమెంట్ లో ఇచ్చిన నాటి అధికారపక్షం .. నేటి ప్రతిపక్షం తాము అధికారంలోకి రాగానే.. ఆ ప్రత్యేకహోదా ఇస్తామని పదే పదే చెబుతోంది. అలాంటప్పుడు… జగన్మోహన్ రెడ్డి… రాజకీయంగా తెలివైన నిర్ణయం తీసుకోవాల్సింది. కనీసం పరిశీలిస్తామని కూడా చెప్పకుండా… చాన్సే లేదన్న పార్టీపై నమ్మకం వ్యక్తం చేస్తూ.. ఇస్తామని చెబుతున్న పార్టీపై నమ్మకం లేనట్లు ప్రకటనలు చేయడంతోనే.. ఆయన ప్రజల్ని మోసగించడానికి ప్రయత్నిస్తున్నారని ఇట్టే అర్థమైపోతుంది.
ప్రత్యేకహోదా విషయంలో బీజేపీ ఏదో ఇస్తామని వెంట బడుతోందని.. మద్దతు అడుగుతోందని.. కానీ తాను రాతపూర్వకంగా.. ఇస్తే మద్దతు ఇస్తామన్నట్లుగా జగన్ చెప్పుకొస్తున్నారు. బహుశా.. ఎన్నికలకు ముందుగా పొత్తుల కోసం.. వైసీపీ, బీజేపీలు .. ఇలాంటి స్కిట్ లు వేస్తాయేమో…! అప్పట్లో పధ్నాలుగో అర్థిక సంఘం వల్ల సాధ్యం కాలేదు.. పదిహేనే అర్థిక సంఘంతో ప్రత్యేకంగా మాట్లాడి ప్రత్యేకహోదా మేమే ఇస్తాము.. అని ప్రకటన చేసి… జగన్ తో పొత్తు పెట్టుకునే ఆలోచనలు ఉన్నాయేమో…? ఆ విధంగా ప్రజలకు నమ్మించడానికి రాత పూర్వకంగ హామీ ఇవ్వాలంటూ.. జగన్ కొత్త స్కెచ్ ప్రారంభించారనే అభిప్రాయలు రాజకీయవర్గాల్లో వస్తున్నాయి. ఏం చేయాలనుకుంటున్నారో….ముందు ముందు తేలిపోతుంది.