ప్రతిపక్ష పార్టీ వైకాపా ఈ మధ్య కాలంలో ఒకే ఒక్క అంశంపై బాగా దృష్టి పెడుతోంది..! అదేంటంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీచోటా అవినీతికి పాల్పడ్డారని విమర్శలు గుప్పించడం, ఆ అంశంలో జైల్లో పెట్టొచ్చు, ఈ అంశంలో బోనులోకి లాగొచ్చు, ఆ అవినీతిపై విచారణ వెయ్యొచ్చు.. ఇలాంటి కారణాలను అన్వేషించడానికే ప్రాధాన్యత ఇస్తోంది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా కాకుండా, రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ కి కొత్త రాజధాని ఎక్కడ వస్తుందో తనకి ముందే తెలుసుననీ, కానీ ఆ ఊరి పేరును బయటపెట్టకుండా… తన బినామీలు లాభపడేలా వ్యవహరించారని ఆరోపించారు. ముందేమో నూజీవీడు దగ్గర అన్నారు, ఆ తరువాత నాగార్జున కొండ దగ్గర అన్నారు… ఇలా తనకు అనుకూలమైన మీడియాలో లీకులు ఇచ్చారన్నారు. తన బినామీలను రంగంలోకి దింపి, రైతన్నల భూముల్ని అతి తక్కువ ధరలకు కొనుగోలు చేశారన్నారు. ముఖ్యమంత్రి అనేవాడు తన ప్రజలు బాగుపడాలని ఆలోచన చేస్తాడనీ, రాజధాని ఫలానా ప్రాంతంలో వస్తుందని ముందే చెప్పి, భూముల్ని అమ్ముకోవద్దని చెప్తారన్నారు. తన బినామీలందరూ భూములు కొన్న తరువాత రాజధాని ఇక్కడే వస్తుందని ప్రకటించారని ఆరోపించారు. ఇలా రైతులకు నష్టం కలిగించే వ్యవహరించిన ముఖ్యమంత్రిని ఎందుకు జైల్లో పెట్టకూడదని జగన్ ప్రశ్నించారు..? మామూలుగా అయితే ఇలాంటివారిపై వెంటనే చర్యలు తీసుకుంటారన్నారు..!
రాజధానికి భూములు ఇవ్వని రైతులపై బలప్రయోగం చేశారనీ, తమకు అనుకూలమైన వారి భూములను అమ్ముకునే విధంగా జోన్ విధానాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలపై కూడా జగన్ ఎద్దేవా చేశారు. ఆయన ఏ దేశానికి వెళ్లినా, అక్కడ ఏదైనా పెద్ద భవనం కనిపిస్తే.. అది అమరావతిలో వచ్చేస్తుందని చెబుతారన్నారు. రకరకాల ఫొటోలూ రకరకాల డిజైన్లు మాత్రమే ఇచ్చారని అన్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి అడుగుకి రూ. 10 వేలు చొప్పున ఖర్చుచేసి అవినీతికి పాల్పడ్డారు అన్నారు. ఆ స్థాయి ఖర్చుతో శాశ్వత భవనాలు నిర్మించొచ్చు అన్నారు. ఇలా జగన్ ప్రసంగం అంతా అవినీతి ఆరోపణల చుట్టూ తిరిగింది. ప్రతీచోటా అవినీతీ అవినీతీ అని చెబుతున్నారే తప్ప… పక్కా ఆధారాలను చూపే ప్రయత్నం చేయడం లేదు. ఫలానా చోట, ఇదిగో ఫలానా విధంగా అవినీతి జరిగిందని ప్రజలకు చెప్తే మరింత బాగుంటుంది! ఇసుక నుంచి మట్టి దాకా, మట్టి నుంచి గుడి దాకా, గుడి నుంచి బడి దాకా.. అంటూ ఏదో ఒక పడికట్టు వాక్యాన్ని పదేపదే చెప్పడం ద్వారా ఆ అవినీతి బయటకి రాదు కదా! ఆధారాలున్నప్పుడు హాయిగా బయటపెట్టొచ్చు. నిజాలు రాయడం లేదంటూ ఎల్లో మీడియా అంటూ ఇతరులపై వాపోయే బదులు.. ఆయనకీ సొంత మీడియా ఉంది, దాన్లో హ్యీపీగా రాసుకోవచ్చు!