వైసీపీలో పలు నియోజకవర్గాలకు ఇంచార్జులు లేరు. ఉన్న వారు కనిపించడం లేదు. పోటీ చేసి ఓడిపోయిన చాలా మంది కనిపించకుండా పోయారు. ఈ క్రమంలో కొత్త నేతలతో ఆ పదవులను భర్తీ చేయాలని చూస్తున్నారు. కానీ ఎంత వెదికినా .. కనిపించేవారు లేరు. తాజాగా సత్తెనపల్లికి ఎవరికీ తెలియని నేతను నియమించారు. ఆయన పార్టీ కోసం ఎపుడు పని చేశారో అని .. సత్తెనపల్లి వైసీపీ నేతలు వెదుక్కోవాల్సి వచ్చింది.
ఇలాంటి నియోజకవర్గాలు మరో యాభై వరకూ ఉన్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల సమయంలో నేతల్ని జగన్ జంబ్లింగ్ చేసి పడేశారు. ఎవరుఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇప్పుడు అందరూ తమ తమ నియోజకవర్గాలను తమకు కేటాయించాలని అడుగుతున్నారు. జగన్ మాత్రం ఇంకా ఏదీ తేల్చడంలేదు. మైలవరం లాంటి నియోజకవర్గానికి మళ్లీ జోగి రమేష్ కు ఇచ్చినా ఆయన నియోజకవర్గంలో అడుగుపెట్టడంలేదు. టీడీపీ నేతలతో కలిసి తిరిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
పర్చూరు, చీరాల లాంటి చోట్ల పోటీ చేసిన ఎవరూ అడ్రస్ లేరు. అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి వారు ఉన్నారు. ఎన్నికల తర్వాత గెలిచిన నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు ఆసక్తిగా లేరు. అసెంబ్లీకి వెళ్లేందుకు జగన్ అనుమతించకపోవడంతో ఇక ఏం చేయాలో తెలియక వారు కిందామీదా పడుతున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని.. మండల స్థాయి వరకూ అధ్యక్షుల్ని నియమిస్తామని చెబుతున్నారు కానీ.. అలాంటి వారు దొరకడం లేదు.