రాజమండ్రి రోడ్ కం రైలు బ్రిడ్జి మీదుగా తూర్పుగోదావరి జిల్లాలోకి అట్టహాసంగా అడుగుపెట్టిన జగన్కు ఆ తర్వాత పరిస్థితులేమీ కలసి రావడం లేదు. మూడో రోజే.. చంద్రబాబుపై వ్యక్తిగతంగా తిట్లు లంకించుకున్నారు. ఏదైనా బావి చూసుకుని దూకి చావాలని.. చంద్రబాబుకు శాపనార్థాలు పెట్టారు.
జగన్ భాష విని ఆ పార్టీ కార్యకర్తలు చప్పట్లు కొట్టినా.. జగన్ ఇంతగా అసహనానికి గురవడం ఏమిటన్న చర్చ ఆ పార్టీలో ప్రారంభమయింది. వివిధ సర్వేల్లో వెల్లడవుతున్న ఫలితాలే జగన్ అసహనానికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ఎన్ని ఆరోపణలు చేస్తున్నా… ఎంత తీవ్రంగా విమర్శిస్తున్నా… ప్రజల ఆలోచనల్లో పెద్దగా మార్పు ఉండటం లేదన్న అభిప్రాయం జగన్లోనే ఉంది. సోమవారం.. పి.గన్నవరం పాదయాత్రలో ప్రసంగించిన జగన్… “తనను ఆశీర్వదించమని ప్రాథేయపడుతున్నానన్నారు..”. ప్రాధేయపడుతున్నాననే మాట జగన్ నోటి వెంట రాగానే అక్కడి పార్టీ కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోయారు.
క్రమంగా జగన్మోహన్ రెడ్డి నమ్మకం కోల్పోతున్నారని… ప్రజలను ఒక్క చాన్స్ అని బతిమాలుతున్నట్లు ప్రసంగించడంలోనే ఆ విషయం తేలిపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్మోహన్ రెడ్డి గతంలో దేవుడి దయ వల్ల తాను ముఖ్యమంత్రి అవుతానని చెప్పేవారు. ప్రజలపై ఆయనకు నమ్మకం లేదని కొన్ని విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి దేవుడి దయ… ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిని అవుతానని చెప్పుకుంటున్నారు. కానీ తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం తనను ఆశీర్వదించాలని ప్రాధేయపడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు.
అదే సమయంలో చంద్రబాబుపై విమర్శల విషయంలో మాత్రం ఏ మాత్రం వాడి తగ్గించలేదు. కొబ్బరిపై జీఎస్టీని కూడా.. చంద్రబాబే వేయించినట్లు చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం లగడపాటి రాజగోపాల్కు చెందిన ఆర్జీస్ ఫ్లాష్ టీం… చేసిన సర్వే ఓ చానల్లో ప్రసారం అయింది. దాంతో… వైసీపీ పరిస్థితి దిగజారిపోతుందని తేలింది. పాదయాత్ర చేసిన జిల్లాల్లోనూ మెరుగైన ఫలితాలు రావని తేలింది. ఈ సర్వే జగన్పై ప్రభావం చూపించి ఉంటుందని… లేకపోతే.. తన స్వభావానికి విరుద్దంగా… ఆశీర్వదించమని ప్రాధేయపడటం ఏమిటన్న చర్చ వైసీపీలోనే ప్రారంభమయింది.