ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన కత్తిదాడి కేసు ఇప్పుడు ఎన్.ఐ.ఎ. పరిధిలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం సరికాదనేది టీడీపీ సర్కారు అభిప్రాయం. ఈ మేరకు తమ నిరసనను వ్యక్తం చేస్తూ కేంద్రానికి ఒక లేఖ రాయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ లేఖ ఎవరు రాస్తారనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి రాయాలా, లేదంటే రాష్ట్ర హోమంత్రి రాస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం.
లేఖలో ఏయే అంశాలు ప్రస్థావించాలనేది పోలీసు అధికారులు నిర్ణయించాలనీ, దానికి సంబంధించిన సమాచారం తెప్పించాలంటూ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. న్యాయ నిపుణులను కూడా తగు సలహాలు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. నిజానికి, జగన్ పై కోడి కత్తి దాడి కేసు ఎన్.ఐ.ఎ. పరిధిలోకి రాదని కొంతమంది నిపుణులు అంటున్నారు. ఉగ్రవాదం, విమానాల హైజాక్ వంటి కేసుల్లో మాత్రమే ఎన్.ఐ.ఎ. జోక్యం ఉంటుందని అంటున్నారు. ఆ విషయాన్నే కేంద్రానికి లేఖ ద్వారా గుర్తు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు రాష్ట్ర పరిధిలో పూర్తయిందనీ, వివరాలు షీల్డు కవర్లో పోలీసులు హైకోర్టుకు కూడా సమర్పించారనీ, ఆ ప్రక్రియ పూర్తి కానీయకుండా కేసు విచారణ బదిలీ చేయడం సరికాదనేది రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం.
సాంకేతిక అంశాలను కేంద్రం సరిగా పాటించలేదనే కోణంలోనే ఏపీ సర్కారు అభ్యంతరాలు వ్యక్తం చేయాలని అనుకుంటున్నా, దీన్ని రాజకీయంగానే వైకాపా చూస్తుంది. జగన్ పై దాడి కేసును కూడా సక్రమంగా దర్యాప్తు కానీయకుండా టీడీపీ సర్కారు అడ్డుకునే ప్రయత్నం చేస్తోందనే విమర్శనే ప్రజల్లోకి వైకాపా ప్రచారంగా తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక, కేంద్రానికి ఇప్పుడు లేఖ రాసినా వెంటనే స్పందించేసే పరిస్థితి లేదన్నది కూడా అందరికీ తెలిసిందే కదా.