అధికార దుర్వినియోగం గురించి, పోలీసుల్ని నేరస్తులుగా మార్చి వాడుకున్న వైనం గురించి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వైనం గురించి జగన్ లాంటి వాళ్లు మాట్లాడితే వినేవాళ్లకు కూడా కాస్త ఎబ్బెట్టుగానే ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటే.. తనకు మాత్రమే ఉండే హక్కులని ఆయన అనుకుంటారు. అధికారం లో ఉన్నాం కాబట్టి ఏమైనా చేయవచ్చని అనుకున్న నైజం అయనది. కానీ ఇప్పుడు ఆయన తెగ బాధపడిపోతున్నారు.
వారానికి రెండు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటున్న జగన్ .. ఇటీవలి కాలంలో ఎవర్నీ పిలిపించి తన పాత ప్రసంగాన్ని రిపీట్ చేయలేదు. అందరూ ఆ స్పీచ్‌ను మర్చిపోతారని అనుకున్నారేమో కానీ కొంత మందిని పిలిపించి అదే క్యాసెట్ వినిపించారు. తాను ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు అన్నం తిన్నారని ఇప్పుడు తినడం లేదని ఆయన బాధపడ్డారు. టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారని చెప్పుకొచ్చారు. జనంలోకి వెళ్లకుండా అజ్ఞాతంలో ఉంటోంది వైసీపీ నేతలు. చివరికి జగన్ రెడ్డి కూడా. అయినా టీడీపీ నేతలదే అజ్ఞాతం అని ఆయన అనుకుంటున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు విపక్ష పార్టీలకు కనీసం పోటీ కూడా చేయనివ్వకుండా ఏకగ్రీవం చేసుకున్నారు జగన్. చివరికి వార్డు మెంబర్, కౌన్సిలర్ పదవుల్ని కూడా వదిలి పెట్టలేదు. మాచర్ల లాంటి చోట్ల పోటీ చేయలేదు. పులివెందుల సంగతి చెప్పాల్సిన పని లేదు. జడ్పీటీసీలు, కార్పొరేటర్ల సీట్లు కూడా ఏకగ్రీవం అయ్యాయంటే జగన్ మార్క్ ప్రజాస్వామ్యాన్ని అందరూ చూసి ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన ప్రజాస్వామ్య నీతులు వల్లిస్తున్నారు. బలం లేకపోయినా పదవులు కావాలనుకుంటున్నారని అంటున్నారు.
జగన్ పార్టీ నేతలతో చెప్పాలి కాబట్టి చెబుతున్నట్లుగా ఉన్నారు. ఆయన వాయిస్ లో బేస్ కనిపించడం లేదు. ఆయనలో అంత కాన్ఫిడెన్స్ కూడా కనిపించడం లేదు. రోజు రోజుకు తమ పరిస్థితి దిగజారిపోతోందన్న ఆందోళన ఆయనలో కనిపిస్తోందని పార్టీ నేతలు గుసగులాడుకుంటున్నారు.