వైసీపీ అధినేత జగన్ తన పతనం నుంచి ఏ మాత్రం పాఠాలు నేర్చుకోవడం లేదు. బడ్జెట్ పెట్టిన వారం రోజులకు తీరికగా బెంగళూరు నుంచి వచ్చి ప్రెస్మీట్ పెట్టి.. తాను ఎప్పుడూ చెప్పే పలావ్ – బిర్యానీ కథ చెప్పారు. అప్పుల లెక్కలు తేలక బడ్జెట్ కాస్త ఆలస్యంగా పెట్టినప్పుడు పథకాలు అమలు చేయలేకే బడ్జెట్ పెట్టలేదు. ఇప్పుడు ఓ నెల ముందే బడ్జెట్ పెడితే.. కేటాయింపులు సరిగ్గా లేవని అంటున్నారు. ఒక్కటంటే ఒక్క విషయంలోనూ ఆయన నిర్మాణాత్మకమైన విమర్శ చేయలేకపోయారు.
అయితే ఆయనలోని అహంకారం మాత్రం అసలు తగ్గలేదని చివరిలో తేలిపోయింది. పవన్ కల్యాణ్ ప్రస్తావన వచ్చినప్పుడు కార్పొరేటర్ కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అని చెప్పుకొచ్చారు. పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం. జగన్ ఎమ్మెల్యే. ఇంకొన్ని రోజులు అసెంబ్లీకి పోకపోతే ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఉంటుందో ఉండదో చెప్పలేం. ఆయన ఏ స్థాయి నుంచిఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎమ్మెల్య్యేగా పదవి పోతే.. మళ్లీ గెలిచే పరిస్థితుల్లో కూడా లేరు. కానీ ఆయన అహం మాత్రం తగ్గడం లేదు.
పవన్ కల్యాణ్ పదేళ్ల పాటు కష్టపడి పార్టీని బిల్డ్ చేసుకుని రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఈ రోజు జగన్ రెడ్డి అంత ఘోరమైన పరిస్థితుల్లో ఎందుకు ఉన్నారో ఆయనకు కూడా బాగా తెలుసు. పవన్ కల్యాణ్ వల్లనే జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. పవన్ కొట్టిన దెబ్బ జగన్ ను పాతాళంలోకి పడేసింది. అయినా పవన్ ను తక్కువ చేసి మాట్లాడి.. తానేదో గొప్ప అన్న ఫీలింగ్ తెచ్చుకుంటున్నారు. కానీ ప్రజల్లో మరో రకంగా వెళ్తుంది.
ఇదే ప్రెస్ మీట్లో చంద్రబాబుకి ప్రతిపక్ష నేత హోదా తానే ఇచ్చానని చెప్పుకున్నారు. కానీ ప్రజలు ఇచ్చారన్న సంగతిని చెప్పుకోవడం లేదు. చంద్రబాబుకు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారుకాబట్టి ప్రతిపక్ష హోదా వచ్చింది. హోదా లేదు అని చెప్పడానికి సీఎంకు అధికారంలేదు..అది సీఎం ఇచ్చేది కాదు. ఇంకా చంద్రబాబు హోదా తీసేస్తానని ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారు . కానీ చేతకాలేదు. జగన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ తన అహంతో ఇంకా ఇంకా దిగజారిపోతున్నారు. దానికి ఆయన మూల్యం మళ్లీ మళ్లీ చెల్లించుకుంటారు. ప్రజాస్వామ్యం అంటే అదే.