ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గట్టి షాక్ ఇచ్చారు. విశాఖలో గత ప్రభుత్వం ఆమోద పబ్లికేషన్స్‌కు కేటాయించిన ఏకరంన్నర స్థలాన్ని రద్దు చేస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ స్థల కేటాయింపులో ఎలాంటి ప్రజాప్రయోజనం లేదని.. అందులో ఎలాంటి నిర్మాణాలు లేవని… సమాచార, ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఆ స్థలం విలువ నలభై కోట్లకుపైగా ఉంటుందని.. కానీ చంద్రబాబు సర్కార్ యాభై లక్షల రూపాయలకే ఇచ్చిందని…ఆరోపించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆంధ్రజ్యోతికి ఇప్పటికే ఏపీ సర్కార్ ప్రకటనలు నిలిపి వేసింది. ఇప్పుడు… ప్రభుత్వం తరపున ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో.. అన్నీ తీసుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏపీ కేబినెట్ నిర్ణయాన్ని ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఖండించింది. ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని మండిపడింది. చంద్రబాబు సర్కార్ తమకు ఎలాంటి భూమి కేటాయించలేదని.. అది.. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా… తీసుకున్న స్థలానికి ఇచ్చిన పరిహారమని.. ఆంధ్రజ్యోతి యాజమాన్యం ప్రకటించింది. 1980 దశకంలో.. ఆంధ్రజ్యోతికి చెందిన ఎకరం స్థలాన్ని రహదారి విస్తరణలో భాగంగా ప్రభుత్వం తీసుకుంది. దానికి బదులుగా ఇచ్చిన స్థలం కూడా.. అలాగే భూసేకరణలో వెళ్లిపోయింది. దీనికి ప్రతిగా… పరదేశి పాలెంలో.. ఎకరంన్నర భూమిని కలెక్టర్ సిఫార్సు మేరకు.. ఆమోద పబ్లికేషన్స్ కు ఇచ్చారు. ఈ భూమికి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేనప్పటికీ.. కలెక్టర్ ఆ మేరకు సిఫార్సు చేయడంతో రూ. యాభై లక్షలకుపైగా చెల్లించినట్లుగా ఆంధ్రజ్యోతి యాజమాన్యం చెబుతోంది.
పూర్తి న్యాయబద్ధంగా జరిగిన కేటాయింపులను రద్దు చేయడం… చట్ట విరుద్ధమని.. ఆంధ్రజ్యోతి యాజమాన్యం చెబుతోంది. ఈ మేరకు వారు న్యాయపోరాటం చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. నిజానికి పరిహారంగా ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకోవడం… సాధ్యం కాదని న్యాయవర్గాలు చెబుతున్నాయి. పరిశ్రమల కోసమో.. ఇతర అవరసాల కోసమో.. వాటికి తగ్గ నిబంధనలను … స్థలం పొందిన కంపెనీలు.. సంతృప్తి పరచకపోతే.. కేటాయింపులు రద్దు చేయడానికి.. స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు. మొత్తానికి ఆంధ్రజ్యోతికి జగన్మోహన్ రెడ్డి దెబ్బమీద దెబ్బకొడుతున్నట్లయింది.