రాజకీయం అంటే.. వ్యక్తిత్వాలను చంపడం కాదు.. గౌరవించకుండా అవమానిండం కాదు. వద్దనుకుంటే.. మనుషుల్ని కూడా గుర్తించకపోవడం కాదు. మనుషుల్ని మనుషులుగా చూడకపోవడం అసలు కాదు. కానీ దురదృష్టవశాత్తూ… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ అవలక్షణాలన్నింటినీ తన రాజకీయంలో కలిపేస్తున్నారు. ఓ దళిత ఎమ్మెల్యేను అత్యంత దారుణంగా అవమానించిన వ్యవహారంలో.. ఈ విషయం స్పష్టమవుతోంది. చిత్తూరు జిల్లా పూతల పట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్.. జగన్ ఇంటి ముందు నాలుగు గంటల పాటు కుటుంబంతో సహా పడిగాపులు పడ్డారు. నిజానికి అది ఇల్లు మాత్రమే కాదు.. పార్టీ ఆఫీస్ కూడా. పార్టీ ఆఫీసులోకి వెళ్లడానికి ఎమ్మెల్యేలకు సర్వ హక్కులు ఉంటాయి. వాటిని జగన్ ప్రత్యేకంగా ఇవ్వాల్సిన పని లేదు. కానీ గేట్లు మూసేశారు. కండువాలు కప్పించుకునేందుకు చిన్న స్థాయి నేతలకు కూడా గేట్లు బార్లా తెరిచారు కానీ.. సొంత పార్టీ ఎమ్మెల్యేకు.. అదీ ..దళిత ఎమ్మెల్యేను మాత్రం.. జగన్ ఇంట్లోకి రానివ్వలేదు.
నాలుగు గంటల పాటు.. నిలువుకాళ్లపై జగన్ ఇంటి ముందు పడిగాపులు పడిన సునీల్ కుమార్… అవమానభారంతో అక్కడ్నుంచి వెళ్లిపోయారు. కానీ జగన్ లో మాత్రం కదలిక రాలేదు. జగన్ వ్యవహారశైలి తెలుసు కాబట్టి.. సునీల్ కుమార్ని ఏ ఒక్క వైసీపీ నేత పలకరించలేదు. చివరికి ఆయనకు గత ఎన్నికల్లో టిక్కెట్ ఇప్పించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో.. ఆయన కన్నీటి పర్యంతమవుతూ.. ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ” నాకు సీటు ఇప్పించిన వారికిగానీ.. వైసీపీకి కానీ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులను తేలేదు. నా ప్రవర్తనతో జగన్కు కూడా ఎలాంటి చెడ్డ పేరు తేలేదని..” ఆవేదన వ్యక్తం చేశారు.
నిజానికి పూతలపట్టు ఎమ్మెల్యే పై… వైసీపీ పరంగా ఎలాంటి రిమార్కులు లేవు. ఆయన టీడీపీతో సన్నిహితంగా ఉండటం లాంటి పనులు కూడా చేయరు. ఆయన గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయనతోనే టచ్లోఉంటారు. అయితే.. ఇటీవలి కాలంలో..శివప్రసాద్ సోదరికి… టిక్కెట్ ఇప్పించాలని పెద్దిరెడ్డి నిర్ణయించారు. దీంతో సునీల్ కుమార్ ను వద్దనుకున్నారు. నిజానికి మెరుగైన అభ్యర్థి దొరికితే ఏ పార్టీ అయినా అదే పని చేస్తుంది. కాకపోతే.. పిలిచి.. ఫలానా కారణంతో టిక్కెట్ ఇవ్వడం లేదని.. బుజ్జగిస్తారు. కానీ ఇక్కడ జగన్ అసలు సునీల్ అవసరమే లేదన్నట్లుగా… అవమానించి పంపేశారు. ఆయనకు బహిరంగంగా జరిగిందని… ఇతరులకు అలాంటి ట్రీట్ మెంట్ అంతర్గతంగా జరిగిందని… వంగవీటి రాధా నేతల ప్రకటనలతో తేలిపోయిందనే అభిప్రాయాలున్నాయి.