ఢిల్లీలోవైసీపీ ఎంపీలు బడ్జెట్ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజయసాయిరెడ్డి రాష్ట్ర కోణంలో అత్యంత పర చెత్త బడ్జెట్ అని పార్లమెంట్లో ప్రసంగించారు. మిగతా ఎంపీలు బయట అదే మాటలు చెబుతున్నారు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి వచ్చిందేమీ లేదు. ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న వాటిలో ఒక్కటంటే ఒక్క దాన్నీ పట్టించుకోలేదు. ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం నోరు విప్పలేదు. అభిప్రాయం చెప్పలేదు.
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించాల్సినవి చాలా ఉన్నాయి. అందులో మొదటిది పోలవరం. ఒక్క రూపాయి కాదు కదా అసలు పోలవరం అనే ప్రస్తావనే బడ్జెట్లో రాలేదు. ఇవ్వాలన్న చట్టం కూడా ఉంది . కానీ ఇవ్వడం లేదు. అయినా నోరు మెదపడం లేదు. వెనుకబడిన జిల్లాలకు నిధులు, ప్రత్యేకహోదా, పారిశ్రామిక రాయితీలు, రెవిన్యూ లోటు భర్తీ, రాజధాని కోసం నిధులు, విశాఖ, విజయవాడ మెట్రో రైలుకు నిధులు, కడప ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు, రామయపట్నం పోర్టు, విశాఖ రైల్వే జోన్ ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రం అమలు చేయాల్సిన హామీలు.. ఇవ్వాల్సిన నిధుల జాబితా దండిగానే ఉంది. కానీ బడ్జెట్లో వీటి ప్రస్తావన ఎక్కడా లేదు.
బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై పొరుగు రాష్ట్ర సీఎంకేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి రెండున్నర గంటల పాటు కేంద్రాన్ని విమర్శించారు. దాంతో తెలంగాణకు జరిగిన అన్యాయం హైలెట్ అయింది. కానీ ఏపీ సీఎం కనీసం అభిప్రాయం చెప్పడానికి మొహమాట పడుతున్నారు. దీంతో పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు ఏం మాట్లాడినా లెక్కలోకి రావడం లేదు. పార్టీ అధినేత.. సీఎం మాట్లాడనప్పుడు ఎంపీలు మాట్లాడితే వారికేం విలువ ఉంటుందన్న ప్రశ్న వస్తోంది. ఈ వి,యం మాట్లాడాలని సీఎం జగన్ కూడా అనుకోవడం లేదు. అనుకుంటే ఈ పాటికి మాట్లాడి ఉండేవారే.