వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు శివకుమార్ విషయంలో జగన్ దిగివచ్చారు. శివకుమార్ ను చర్చలకు రావలసిందిగా వైయస్ జగన్ ఆహ్వానించారు. కలిసి పనిచేయడానికి సిద్ధమేనంటూ ఆఫర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..
వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు ఎవరు అని అడిగితే జగన్ అని అందరూ అంటారు కానీ టెక్నికల్ గా చూస్తే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శివకుమార్. జగన్ అధికారికంగా పార్టీ ప్రకటించడానికి ముందే శివకుమార్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరుతో పార్టీని స్థాపించారు. ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ కూడా చేశారు. అయితే ఇదే పేరుతో పార్టీని ఏర్పాటు చేయాలని జగన్ భావించడంతో శివ కుమార్ ని తనతో కలుపుకుని వై ఎస్ ఆర్ సి పి పార్టీని టేకోవర్ చేశారు. శివకుమార్ కు పార్టీ తెలంగాణ సంబంధిత వ్యవహారాలను అప్పగించారు. అయితే 2018 తెలంగాణ ఎన్నికల సమయంలో శివ కుమార్ తమ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని ప్రకటన జారీ చేశారు. దీంతో ఆగ్రహించిన జగన్ శివకుమార్ నే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే శివకుమార్ ఏమాత్రం తగ్గకుండా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన తనను తప్పించే అధికారం జగన్ కు లేదంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ను ఆశ్రయించారు.
వ్యవహారం కేంద్ర ఎన్నికల కమిషన్ దాకా వెళ్లడంతో వైయస్ జగన్ మెత్తబడ్డారు. తీరా ఎన్నికల ముందు ఇటువంటి సాంకేతిక సమస్యలు ఎందుకు అనుకున్నారో ఏమో కానీ శివ కుమార్ ని చర్చలకు ఆహ్వానించారు. ఇద్దరం కలసి పని చేద్దాం అంటూ ఆఫర్ ఇచ్చారు. శివ కుమార్ తో అనధికారికంగా చర్చలు జరుపుతున్నారు. ఏది ఏమైనా శివకుమార్ విషయంలో వైఎస్ జగన్ వ్యవహారశైలి చూసిన వారంతా మొత్తానికి జగన్ శివకుమార్ దెబ్బకి దిగి వచ్చాడు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.