వృద్ధాప్య పెన్షన్లను రూ. 3వేలకు పెంచుకుంటూ పోతామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి.. ఆ పథకాన్ని అమలు చేస్తూ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఇస్తున్న రూ. 2వేల పెన్షన్ను రూ. 2250కి పెంచుతూ… తొలి సంతకం చేశారు. ఏడాదికి రూ. 250 పెంచుతానని.. జగన్ ప్రకటించారు. నవరత్నాల్లో ఇప్పటికిప్పుడు.. ప్రజలకు నేరుగా మేలు చేసే నిర్ణయాన్ని.. జగన్మోహన్ రెడ్డి అదొక్కటే ప్రకటించారు. అయితే.. తనకు మేనిఫెస్టో పవిత్ర గ్రంధమని… అందులో చెప్పినవన్నీ అమలు చేస్తానని ప్రకటించారు. దానికి సంబంధించిన కొంత కార్యాచరణ ప్రమాణస్వీకార వేదికపై ప్రకటించారు.
ఆగస్టుకల్లా రూ. 5వేల జీతంలో 4 లక్షల ఉద్యోగాలు..!
కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పాలన అందించ వ్యవస్థలో మార్పులు తేవాల్సి ఉందని.. అందుకే కొన్ని విప్లవాత్మక మార్పులు చేస్తామని ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీ వచ్చే సరికి గ్రామాలలో యువతకు ఉద్యోగాలిస్తామని… ప్రతి 50 ఇళ్లకు ఓ గ్రామ వాలంటీర్ను నియమిస్తామని ప్రకటించారు. యాభై ఇళ్లకు ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీ చేస్తామని స్పష్టం చేశారు. ఆ గ్రామంలోని యువకులకే… అదీ కూడా సేవా దృక్పథం ఉన్న యువకులను నియమించి రూ. 5వేల జీతం ఇస్తామన్నారు. ఇలా మొత్తంగా నాలుగు లక్షల ఉద్యోగాలు ఆగస్టు 15కల్లా భర్తీ చేస్తామని ప్రకటించారు. వీరికి జీతాలివ్వడానికి కారణం.. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందడంలో కక్కుర్తి పడకూడదనేనని.. స్పష్టం చేశారు.
ఆక్టోబర్ రెండు కల్లా గ్రామ సచివాలయంలో మరో లక్షా 20వేల ఉద్యోగాలు..!
అలాగే… ప్రతీ గ్రామంలోనూ.. ఓ గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు చేసి.. అందులో పది మందికి ఉద్యోగాలిస్తామని జగన్ ప్రకటించారు. ఇలా మరో.. లక్షా ఇరవై వేల మందికి ఉద్యోగాలిస్తామన్నారు. ఆగస్టు 15 తర్వాత ఎవరికైనా పథకాలు అందకపోతే నేరుగా సీఎం ఆఫీస్కు ఫిర్యాదు చేయవచ్చని..స్పష్టం చేశారు. ఎవరైనా లంచాలు అడిగినా.. కాల్ చేయవచ్చని.. దాని కోసం కాల్ సెంటర్ ఏర్పాట్లు చేస్తామన్నారు. గ్రామ సచివాలయంలో ఉద్యోగుల్ని అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతికల్లాఅందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. పెన్షన్ కావాలన్నా… రేషన్ కార్డు కావాలన్నా.., ఫీజు రీఎంబర్స్ కావాలన్నా.. ఆరోగ్యశ్రీ కావాలన్నా… గ్రామ సెక్రటేరియట్లో పిటిషన్లు పెట్టండి… 72 గంటల్లోనే శాంక్షన్ చేస్తాని స్పష్టం చేశారు.
కాంట్రాక్టులన్నీ రద్దు చేసి.. కొత్త కాంట్రాక్టులకు పిలుపు..!
అవినీతి జరిగిన కాంట్రాక్టుల్ని రద్దు చేస్తాం…! నిబంధనలు మార్చి ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనే విధంగా నిబంధనలు మార్చుతామని జగన్ ప్రకటించారు. ఎంత తక్కువకు టెండర్లు వస్తే.. అంత మొత్తంలో.. ఏపీకి మేలు జరిగిందని.. ప్రజలకు చూపించేలా కొత్త ఒరవడి తీసుకొస్తామన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ను కలిసి… ఓ సిట్టింగ్ జడ్జిని తీసుకొచ్చి… జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తాం. ఆ కమిషన్ చేసే సూచనలు .. మార్పులు చేసి…కాంట్రాక్టులు ఇస్తామని జగన్ ప్రకటించారు. కరెంట్ కొనుగోళ్లలోనూ అవినీతి జరిగింది. అవన్నీ మీ ముందు పెట్టి.. రద్దు చేసి.. తక్కువకు కొనుగోలు చేసి చూపిస్తామనిప్రకటించారు.
మీడియాపై పరువు నష్టం కేసులు వేస్తామని హెచ్చరికలు..!
మీడియాపైనా జగన్మోహన్ రెడ్డి.. విమర్సలు చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లకు చంద్రబాబు మాత్రమే ముఖ్యమంత్రిగా కనిపిస్తారని మండిపడ్డారు. వీళ్లందరికి చెబుతున్నా… జ్యూడిషియల్ కమిషన్ ద్వారా.. టెండర్లు ఇస్తాం..! ఈ యల్లో మీడియా ఏమైనా రాస్తే.. జ్యూడిషియల్ కమిషన్ వద్దకు పంపి… అన్నీ అడుగుతా..!. తర్వాత పరువు నష్టం వేస్తానని హెచ్చరించారు.
ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. స్టాలిన్ , కేసీఆర్ వచ్చారు. సీఎంగా విజయవంతమవ్వాలని ఆశీర్వదించారు. ప్రమాణస్వీకారం తర్వాత ముందుకు క్రైస్తవమత పెద్దలు.. తర్వాత ఇస్లామిక్ మత పెద్దలు.. చివరిగా హిందూమత పెద్దలు.. జగన్ను ఆశీర్వదించారు.