పాదయాత్ర ముగింపు సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీల వర్షం కురిపించారు. వైసీపీ అధికారంలోకి వస్తే 25 జిల్లాల కొత్త ఆంధ్రప్రదేశ్ ను నిర్మిస్తామని ప్రకటించారు. నవరత్నాల్లాంటి పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు. వ్యవసాయానికి పగటిపూట 9గంటల ఉచిత విద్యుత్ , రైతులకు వడ్డీలేని రుణాలు, ప్రతి ఏడాది మేలో రైతుకు రూ.12,500 సాయం, సహా అనేక నవరత్నాల పథకాలను.. జగన్ ఇందులో వల్లే వేశారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని… పంటల బీమా భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. ఆక్వా రైతులకు యూనిట్ కరెంట్ రూ.1.50కే ఇస్తామన్నారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని పంట వేయడానికి ముందే కొనుగోలు ధరల నిర్ణయం తీసుకంటామన్నారు. ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు చేస్తామన్నారు.
రెండు గంటలకుపైగా సాగిన తన ప్రసంగంలో… గంటన్నర సేపు చంద్రబాబు గురించే చెప్పిన జగన్… మిగిలిన పావు గంట సేపు అయినా.. తను గెలిస్తే.. ఏం చేస్తారో.. మాత్రం చెప్పలేదు. రాజధానిని తాను వస్తే ఏం చేస్తారో వివరించలేదు. రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు కానీ.. తాను వస్తే భర్తీ చేస్తాననే హామీ ఇవ్వలేదు. కొన్ని లక్షల మందిని చంద్రబాబు ఉద్యోగాల్లో తీసేశారని చెప్పారు కానీ.. తాను వస్తే వారికి మళ్లీ ఉద్యోగాలిస్తానని చెప్పలేదు. చంద్రబాబు ఇలా చేశారని చెప్పారు కానీ.. తాను వస్తే… వాళ్ల కోసం ఏం చేస్తారో మాత్రం చెప్పలేకపోయారు. చంద్రబాబు పాలనలో ప్రజంలదరూ కష్టాలు పడుతున్నారని.. తన కంటితో చూశానని.. తన గుండెతో విన్నానని చెప్పుకున్న జగన్.. ఆ కష్టాలు తీర్చడానికి తానేం చేయబోతున్నారో వివరించడానికి సమయం తీసుకోలేదు. కానీ ఉచిత హామీల వరద మాత్రం పారించారు.
ప్రసంగంలో అత్యధికంగా చంద్రబాబు పాలన భయంకరంగా ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. చంద్రబాబు పాలనలో రైతుల అప్పులు పెరిగాయని రైతు రుణమాఫీ పెద్ద మోసం అని ముగింపు సభలో జగన్ తీర్మానించారు. రైతులు కష్టాల్లో ఉంటే జాతీయ రాజకీయాలంటూ… చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రాలేదన్నారు. చంద్రబాబు పాలన చూస్తుంటే ఆందోళన కలుగుతోందన్నారు. మేనిఫెస్టోలో 650 వాగ్ధానాలు పెట్టి మోసం చేశారని .. చంద్రబాబు పాలనలో ఓ వైపు కరవు, మరోవైపు తుపానులు వచ్చాయన్నారు. దళారీ వ్యవస్థకు చంద్రబాబు నాయకుడని మండిపడ్డారు. ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయలేదని తేల్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. పిట్టకథలతో సహా… అనేక అంశాలు చెప్పుకొచ్చారు.
పాదయాత్ర ముగింపు ఘనంగా ఉండాలనే ఉద్దేశంతో.. ఏపీలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలను పిలిపించారు. కనీసం ఇరవై బస్సుల్లో జన సమీకరణ చేసుకు రావాలని సూచించారు. టిక్కెట్లు ప్రకటిస్తారన్న ఉద్దేశంతో.. సమన్వయకర్తలు ఉత్సాహంగా వచ్చారు. జనసమీకరణ కూడా చేశారు. కానీ.. బహిరంగసభకు మాత్రం.. వైసీపీ నేతలు.. ఏర్పాట్లు చేయలేదు. గట్టిగా వెయ్యి, రెండుల మంది వస్తే.. ఇరుకుగా మారిపోయే.. ఇచ్చాపురం పాతబస్టాండ్ ప్రాంతంలో బహిరంగసభ పెట్టారు. ఓ విశాలమైన గ్రౌండ్ లో బహిరంగసభ ఏర్పాటు చేస్తారని అందరూ అనుకున్నారు. ఊరి మధ్యలో పెట్టడం… 175 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయడంలో.. ఇచ్చాపురం వాసులు ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో జగన్ టిక్కెట్ల ప్రకటిస్తారేమోనని ఆశ పడిన సమన్వయకర్తలకు నిరాశే మిగిలింది. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ పాదయాత్ర.. చంద్రబాబుపై విమర్శలతో ప్రారంభమై.. చంద్రబాబుపై విమర్శలతో ముగిసిందని చెప్పుకోవాలి.