ప్రత్యేక హోదా కోసం ఇప్పటికీ రాజీలేని పోరాటం సాగిస్తున్నా అన్నారు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి. విజయనగరం సభలో ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. కేంద్రంతో చంద్రబాబు నాయుడు లాలూచీ పడ్డారనీ, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినా ఆయనకి నోటీసులు రాలేదనీ, ఎప్పుడో బాబ్లీ దగ్గర ఒక చిన్న కేసు విషయమై ఇప్పుడు నోటీసులు వస్తే దానిపై హడావుడి చేస్తున్నారని విమర్శించారు. భాజపాతో ఉన్న కనెక్షన్ ద్వారానే బాబ్లీ కేసుని తెర మీదికి తీసుకొచ్చి సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారు అన్నారు. ఓదార్పు యాత్ర కోసం అప్పట్లోనే తాను సోనియా గాంధీతో కొట్లాడానని, అప్పుడు కాంగ్రెస్ తో కలిసి చంద్రబాబు పెట్టించిన తప్పుడు కేసులను ఎదుర్కొంటున్నాననీ, నీ నైజం ఏంటో నా నైజం ఏంటో చెప్పడానికి ఇదొక్కటే చాలని జగన్ చెప్పారు! ఇక, అవినీతి విమర్శలూ, పాలనలో వైఫల్యాలూ…. ఇలాంటి రొటీన్ అంశాలన్నా జగన్ ప్రసంగంలో యథాప్రకారం ఉన్నాయి.
జగన్ మీద నమోదైనవి అక్రమ ఆస్తుల కేసులు. ఈడీ ఎటాచ్ చేసిన ఆస్తులు… అక్రమ మార్గాల ద్వారా సంపాదించారనే అభియోగంతో జరిగినవి. తండ్రి వైయస్ హయాంలో అధికారం అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా జగన్ సంపాదనలు ఉన్నాయనేది ఆ కేసుల్లో అభియోగం. ప్రతీ శుక్రవారం జగన్ విచారణ ఎదుర్కొటున్నారు! అయితే, ఈ కేసుల్ని ప్రజా పోరాట జాబితాలో వేసే ప్రయత్నం జగన్ చేస్తుండటం విడ్డూరంగా ఉంది! జగన్ ఎదుర్కొంటున్నవి వ్యక్తిగత కేసులు.. అంతేగానీ, వాటితో రాష్ట్ర ప్రయోజనాలు ఏ ఒక్కటైనా ముడిపడి ఉన్నాయా..? కేసులను ఎదుర్కొంటున్న తీరుని గొప్ప వీరోచితంగా చెప్పుకుంటూ ఉండటం మరీ విడ్డూరం..! కేసుల్ని ఎదుర్కొంటూ, ప్రతీవారం విచారణకు హాజరౌతూ దాని మీద సానుభూతి పొందాలని జగన్ ప్రయత్నిస్తున్నారనడానికి ఇంతకంటే ఇంకే ఉదాహరణ కావాలి! తనపై తప్పుడు కేసులు పెట్టారు అని ప్రతీసారీ అంటుంటారు, అవి తప్పుడువో కాదో నిర్ణయించేది కోర్టులు కదా!
ఇంకోటి, సోనియా గాంధీతో ఓదార్పు యాత్ర కోసం కొట్లాడనని జగన్ ఇప్పుడు చెబుతున్నారు! అది కూడా సొంత రాజకీయ అజెండాయే తప్ప… దాన్లో రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనం ఏముంది..? తరువాత, కొన్ని నెలలపాటు ఓదార్పు యాత్ర అంటూ తిరిగారు. దాని వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చాయా? యువతకు ఉపాధి లభించిందా? పేద ప్రజల జీవితాలు అనూహ్యంగా మారిపోయాయా..? లేదు కదా… రాజకీయంగా వైకాపాకి అవసరమైన పునాదుల్ని నిర్మించుకోవడం కోసం చేసిన యాత్రే ఆ ఓదార్పు యాత్ర.
ఇంకోటి, ప్రత్యేక హోదాపై రాజీలేని పోరాటం తమదంటారు జగన్! ఇంతకీ, పోరాటంలో రాజీలేకపోతే కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ఏపీ ఎంపీలు పెడుతున్నప్పుడు… ప్రధాని కార్యాలయంతో లాలూ రాజకీయాలు నడిపిందెవరు..? ఓ పక్క సభలో హోదా అంశమై చర్చ జరుగుతుంటే…. పార్లమెంటు లాబీల్లో ప్రెస్ మీట్లు పెట్టి ఏపీ ముఖ్యమంత్రి మీద ఆరోపణలూ విమర్శలూ చేస్తూ చర్చను పక్కతోవ పట్టించేలా ప్రయత్నించడాన్ని ఏ తరహా రాజకీయం అంటారు..? సరే, త్యాగం త్యాగం అంటూ వైకాపా ఎంపీలు రాజీనామాలు చేసి ఏం సాధించారు…? గురివింద గింజ తన నలుపెరుగదన్నట్టుగా జగన్ తీరు ఉంటోంది. ఆయనపై అవినీతి కేసులు ఉంటే… వాటి నుంచి ప్రజలు డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి మీద ఆధార రహిత ఆరోపణలు చేస్తారు. భాజపాతో అన్ని రకాలుగా రాజీపడి, ఢిల్లీ నేతల కాళ్ల మీద పడింది వారైతే… భాజపాతో తెగతెంపులు చేసుకుని, కేంద్రంతో కయ్యం పెట్టుకుని, అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర సర్కారుపై విమర్శలు చేస్తారు. తన వ్యక్తిగత తప్పిదాలతో ఇరుక్కున్న కేసుల్ని కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం సాగిస్తున్న పోరాట జాబితాలో వేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు వీటిని గమనించలేరు, గుర్తించలేరు అనుకుంటే అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదు.