దేవుడి దయవల్ల, ప్రజలందరి ఆశీర్వాదం వల్ల రాబోయే ఎన్నికల్లో మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కష్టాలన్నీ తీరిపోతాయి అంటూ ప్రతిపక్ష నేత జగన్ హామీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాను ముఖ్యమంత్రి అయిన తొలి ఆరు నెలల్లోనే సమస్యలన్నీ తీర్చేస్తా అంటున్నారు. పాదయాత్రలో జగన్ ఇస్తున్న హామీలూ ఇన్నీఅన్నీ కావు. సరే, వాటి అమలుకు ఇప్పుడున్న రాష్ట్ర బడ్జెట్ సరిపోతుందా..? అరకొరగా ఉన్న నిధులను ఎలా సర్దుబాటు చేయగలరు అనే ఆలోచన వైకాపాకి లేదు. ఇక, నెల్లూరు జిల్లాలో ఆత్మీయ సభ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రాగానే సుపరిపాలన తీసుకొస్తామన్నారు.
మోసపూరితమైన వాగ్దానాలు చేసిన చంద్రబాబు నాయుడు, అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి రూ. 90 వేల కోట్ల అప్పులు ఉండేవనీ, కానీ నాలుగున్నరేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో అవి రూ. 2.90 లక్షల కోట్లకు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఇలా అప్పుల మయం కావడానికి ఆయనే కారణమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు పెద్ద ఎత్తున అవినీతి సొమ్ము పంచేందుకు ఆయన సిద్ధమౌతున్నారన్నారు! ధీరోదాత్తుడిగా రాష్ట్రాన్ని చుట్టి వచ్చిన జగన్ కి అధికారం కట్టబెట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు!
రాష్ట్రం అప్పుల గురించి ఆవేదన చెందే ముందు, జగన్ ఇచ్చిన వాగ్దానాల గురించి వైకాపా నేతలు ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకూ జగన్ ఇచ్చుకుంటూ వస్తున్న హామీలు అమలు చెయ్యాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదనీ, లక్ష కోట్లకుపైగా విలువైన హామీలను జగన్ ఇచ్చేశారంటూ నిపుణులు లెక్కలు చెబుతున్నారు. పోనీ, ఇచ్చిన హామీల్లో కూడా సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కార మార్గాల్లేవు, తాత్కాలిక ఉపశమనాలే తప్ప. జగన్ హామీల అమలుకు రాష్ట్ర బడ్జెట్ సరిపోదనే స్పష్టత సామాన్యుడికి కూడా ఉంది. ఇన్ని హామీలు నెరవేర్చడం ఎలా సాధ్యమనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. అలాంటప్పుడు, హామీల అమలు ఎలా సాధ్యమో ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. అంతేగానీ.. చంద్రబాబు ఇచ్చినవి మోసపూరితమైన హామీలు అని వ్యాఖ్యానించడం వల్ల ఏం లాభం? అప్పుల గురించి ఆవేదన చెందే ముందు… తాము అధికారంలోకి రాగానే రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచుతామనే మాట వైకాపా నుంచి వినిపించడం లేదు. ఆదాయ మార్గాలను పెంచే మార్గాలపై జగన్ మాట్లాడటమే లేదు.