వైసీపీ ప్లీనరీ ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమై.. శనివారం మధ్యాహ్నం మూడున్నరకు ముగిసింది. ప్రారంభ, ముగింపు ఉపన్యాసాలతో జగన్ రెండింటినీ పూర్తి చేశారు. ముగింపు సందర్బంగా జగన్ ప్రసంగం సుదీర్ఘంగా సాగింది. ఇందులో ఆయన ప్రజలకు కొన్ని విలువైన సలహాలు ఇచ్చారు. అదేమిటంటే తాను చెప్పేది నమ్మితేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లేయమన్నారు. తాము పెట్టిన మేనిఫెస్టోను అమలు చేశామని అనిపిస్తేనే ఓట్లేయమన్నారు. అయితే అదే సమయంలో తాను చెప్పేది నమ్మాలని ఆయన చాలా ప్రయాసపడి లెక్కలు చెప్పారు. మేనిఫెస్టో అమలు చేశామని చెప్పుకునేందుకు చాలా ప్రయత్నించారు.
ఏపీలో అన్ని మైనస్‌కు టీడీపీ కారణం అని.. చెప్పుకొచ్చారు. అలాగే జరిగిన మంచి అంతటికి తన పరిపాలనే కారణమన్నారు. కోనసీమలో అల్లర్లు వైసీపీ నేతల పనేనని పోలీసులు అరెస్టులు నిరూపిస్తే ఏ మాత్రం బాధ్యత లేకుండా చంద్రబాబు, పవన్ చేపించేశారన్నారు. తాను చేసిన దాని కన్నా చంద్రబాబే అప్పులు ఎక్కువ చేశారన్నారు. తానే మంచిరోడ్లేశాన్నారు తానే ప్రజలకు తక్కువ ధరలకు అన్ని ఇస్తున్నాన్నారు. తన హయాంలోనే ఆరోగ్య శ్రీ బాగా పని చేస్తోదందన్నారు. అన్నీ తన హయాంలోనే బాగున్నాయని చెప్పారు. దీన్ని నమ్మి తీరాల్సిందేనన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇవన్నీ చెప్పిన తర్వాతనే తనను నమ్మితేనే ఓట్లేయమన్నారు.
జగన్ తాను నగదు బదిలీ ద్వారా ప్రజలకు లక్షల కోట్లు పెంచానని.. అది ఎంతో గొప్పగా చెప్పుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ సొమ్మంతా ప్రజల దగ్గరే వసూలు చేస్తున్నారన్న విషయం మాత్రం ప్రస్తావించలేదు. అదే సమయంలో లక్షల కోట్ల అప్పులతో ఏపీ ఆర్థిక పరిస్థితి శ్రీలంకలా మారిందని విమర్శలుచేస్తున్న వారికి చంద్రబాబు హయాంలో అమెరికా అయిందా అని సమాధానం ఇచ్చారు.
ముగింపు ప్రసంగంలో వైఎస్ పేరు ప్రస్తావనకు రాలేదు కానీ.. చంద్రబాబు పేరు మాత్రం కనీసం వంద సార్లు ప్రస్తావించి ఉంటారు. గతంలో ఏమీ జరగలేదని.. తానే అన్నీ చేశానని చెప్పుకునేందుకు తాపత్రయ పడ్డారు. మొత్తానికి ప్లీనరీలో గెలుపునకు దిశానిర్దేశం సంగతేమో కానీ… ఓ రకమైన లోకంలో జగన్ ఉన్నారన్న అభిప్రాయం మాత్రం ఎక్కువ మందిలో వినిపిస్తోంది.