శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో భారీ ప్రమాదం చోటు చేసుకోవడంతో.. ఈ రోజు అక్కడ పర్యటించాలనుకున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పర్యటన వాయిదా వేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం.. ఈ రోజు శ్రీశైలం వెళ్లి.. అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించాల్సి ఉంది. రాయలసీమ ఎత్తిపోతల టెండర్లను ఖరారు చేయాల్సి ఉంది. శ్రీశైలంలో పరిస్థితిని చూసి వచ్చిన తర్వాత… క్యాంప్ ఆఫీసులో.. అపెక్స్ కమిటీ భేటీలో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో సమీక్ష చేయాల్సి ఉంది. అయితే.. అనూహ్యంగా శ్రీశైలం పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం జరగడంతో… అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
అగ్నిప్రమాదం సమయంలో చిక్కుకుపోయిన తొమ్మిది మంది ఆచూకీ ఇంత వరకూ తెలియలేదు. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ చాలా పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఇలాంటి సమయంలో తాను అక్కడకు వెళ్లడం మంచిది కాదని సీఎం అనుకున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణ అధికారులకు ఎలాంటి సాయం కావాలన్నా అందించాలని అధికారులకు సీఎం సూచింంచారు. మరో వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా.. ప్రమాదం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
ఇరవై ఐదో తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపెక్స్ కౌన్సిల్ భేటీలో వినిపించాల్సిన వాదనలపై కసరత్తు చేస్తున్నారు. జలవనరుల అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. అయితే.. కేంద్ర జలశక్తి మంత్రికి కరోనా సోకిన కారణంగా… అపెక్స్ కౌన్సిల్ భేటీ కూడా వాయిదా పడింది. ఆయన ఆస్పత్రిలో చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమావేశం కూడా వాయిదా పడటం.. శ్రీశైలంలో అగ్నిప్రమాదంతో.. ఎక్కడి కార్యక్రమాలు అక్కడ ఆగిపోయినట్లయింది.