తెలుగు మీడియాన్ని నిషేధిస్తూ… ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఇంగ్లిష్ మీడియంను మాత్రమే.. ఉంచాలని జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇప్పటికే సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. అది విద్యా హక్కును ఉల్లంఘించడమేనని దిగువకోర్టులు ఇప్పటికే తేల్చాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం.. ఐదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని నిర్దేశిస్తూ.. కొత్త విద్యావిధానం తీసుకు వచ్చింది. దీంతో ఇప్పుడు.. ఏపీ సర్కార్.. తన ఇంగ్లిష్ మీడియం పట్టుదలను వదులుకోవాల్సిన పరిస్థితి. అలా వదులుకుంటే… జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఎందుకవుతుంది..! హైకోర్టు తీర్పులకే.. కావాల్సిన విధంగా అర్థాలు తీసుకుని… ఆ ప్రకారం ముందుకెళ్లే వ్యూహంతో ఉండే… ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులకు మాత్రం.. సరైన అర్థాలు తీసుకుంటుందా..? అక్కడా తనకు కావాల్సిన అర్థాన్నే తీసుకుని… ముందుకెళ్తోంది.
ఐదో తరగతి వరకు.. కేవలం మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలని.. కేంద్రం చెప్పలేదని.. ఏపీ విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. కేంద్రం కొత్త విద్యావిధానం ప్రకటించిన తర్వాత.. ఒక్కరంటే.. ఒక్కరు కూడా ఈ తరహాలో… దాన్ని అర్థం చేసుకోలేదు. అందరూ… ఐదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన… పరిస్థితిని బట్టి ఎనిమిదో తరగతి వరకు కొనసాగించాలని.. సూచించింది. మాతృభాషలోనే విద్యాబోధన జరిగితే.. పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యం.. సృజనాత్మకత పెరుగుతాయని.. నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే.. ఏపీ సర్కార్ కు మాత్రం.. తెలుగంటే పడటం లేదు. ఇంగ్లిష్లో చదవకపోవడం వల్లనే..పిల్లలు వెనుకబడిపోతున్నారని సీఎం జగన్ అనుకుంటున్నారు. అందుకే.. తెలుగు మీడియంను రద్దు చేసేశారు.
దేశానికి ఓ రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ప్రజలకు కొన్ని ప్రాథమిక హక్కులు ఇచ్చింది. అందులో విద్యా హక్కు కూడా ఉంది. దాన్ని ప్రభుత్వాలు కల్పించి తీరాలి. ఆ హక్కును లాక్కోకూడదు., అలాగే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం.. తమ అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు భాషను … ప్రాణంగా భావిస్తూ ఉంటాయి. కానీ విచిత్రంగా ఏపీ సర్కార్ మాత్రమే.. తెలుగును చంపేయాలనుకుంటోంది. ఇలా చేస్తున్నా… మేధావులు ఎవరూ నోరు మెదపడం లేదు. చివరికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఉత్తర్వలకు కూడా కొత్త అర్థం చెప్పి.. తాము ఇంగ్లిష్ మీడియంకే కట్టుబడి ఉన్నామని.. ప్రకటనలు చేస్తున్నారు. ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో ఉన్న కేసును కూడా కొనసాగిస్తామని చెబుతున్నారు.