ఇసుక సమస్య పరిష్కారానికి మరో అరవై రోజుల గడువు పెట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికి నాలుగు నెలలు గడిచాయి. మూడు నెలల పాటు అసలు ఇసుక దొరకకుండా బ్యాన్ చేశారు. గత నెల ఐదో తేదీన కొత్త పాలసీ ప్రకటించారు. అయినా పరిస్థితిలో మార్పు లేదు. దీంతో మళ్లీ మరో అరవై రోజుల్లో సమస్యను పరిష్కరించాలంటూ ఆధికారులకు ఆదేశాలిచ్చారు. కొత్త పాలసీ వచ్చాక కూడా ఇసుక కొరత తలెత్తుతుండడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ రేటుకు వాహనాల యజమానులు ముందుకు రావడం లేదని అధికారులు చెప్పడంతో.. జిల్లాలో రెండు వేల మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ యువకులకు రుణాలిచ్చి.. వాహనాలు కొనిపించాలనిసూచించారు. వారిని ఇసుక రవాణాకు ఉపయోగించుకోవాలని సూచించారు.
ఎక్కడా ఇసుక మాఫీయా అనే పేరే వినిపించకూడదని ఆయన అధికారులకు సూచించారు. ఏపీ ప్రజలకు సరిపోయేంత ఇసుక లేదని.. అందుకే ఇతర రాష్ట్రాలకు ఇసుక సరఫరా జరగకూడదని స్పష్టం చేశారు. ఇసుక కొరత ఎందుకు ఎర్పడిందనే అంశంపై అధికారులు ఒక్క వరదనే కారణంగా చూపిస్తున్నారు. అయితే.. బ్లాక్ మార్కెట్లో విరివిగా దొరుకుతూండటం ప్రజల్లో విస్తృత చర్చకు కారణం అవుతోంది. వైసీపీ నేతలే ఎక్కువగా ఇసుక బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిలో ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక కావాల్సిన వారు.. వైసీపీ నేతలను సంప్రదించాల్సి వస్తోంది. టీడీపీ హయాంలో.. ట్రాక్టర్ ఇసుక మూడు, నాలుగు వేలకే దొరికేది. అప్పట్లో వైసీపీ నేతలు ఇసుక మాఫియా అనేవారు.
ఇప్పుడు.. ట్రాక్టర్ ఎనిమిది వేలకు ప్రజలకు దొరుకుతోంది. ఇప్పుడేమనాలని.. టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇసుక వ్యవహారం.. లక్షల మందిపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తూండటంతో.. పరిష్కారం చూపాలని.. ముఖ్యమంత్రి కూడా ప్రయత్నిస్తున్నారు. కాని ఇసుక పాలసీలోని లోపాలు… పర్యవేక్షణా లోపంతో… ఇసుక మొత్తం బ్లాక్ మార్కెటర్ల పాలయిందనే విమర్శలు వస్తున్నాయి.