ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి పాఠాలు చెప్పారు. సభలో ఎలా వ్యవహరించాలో.. వివరించారు. దానికి తనే ఉదాహరణగా.. కొన్ని సంఘటనలనూ వివరించారు. సభలో మాట్లాడేందుకు ప్రిపేరవ్వాలంటే.. తాను నాలుగు గంటలకే లేచి ప్రిపేరయ్యేవాడినని గుర్తు చేసుకున్నారు. సభలో హుందాగా ఉండాలని.. పిలుపునిచ్చారు. వ్యక్తిగత దూషణలకు దిగకూడదని… సలహా ఇచ్చారు. సభ్యుల ప్రవర్తనను ప్రజలు చూస్తారని… కూడా గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో.. ఇవన్నీ చెప్పడం.. కామనే కానీ.. ఇన్ని మాటలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఎందుకు.. తన ఎమ్మెల్యేలకు చెప్పలేదన్న విషయం మాత్రం.. వినేవాళ్లకు అర్థం కాకుండా పోయింది.
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న కాలంలో.. అసెంబ్లీలో ఏనాడూ అర్థవంతమైన చర్చ జరగలేదు. పైగా.. అసెంబ్లీలో ఎప్పుడూ వినపడకూడని మాటలు వినబడ్డాయి. ఎమ్మెల్యే రోజా.. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే అనితను.. అన్న మాట… సభ్యసమాజాన్ని నిశ్చేష్టుల్ని చేసింది. ముఖ్యమంత్రి సీటు వద్దకు వెళ్లి… ” కామ సీఎం.. కామ సీఎం ” అంటూ ఆయనను రెచ్చగొట్టిన దృశ్యాలు కనిపించాయి. కామ సీఎం అంటే.. కాల్ మనీ సీఎం అని.. చెప్పుకున్న అసెంబ్లీ కూడా అదే. ఇక..మంత్రులుగా ఉన్న కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ల మాట్లాడిన మాటలను ఎన్ని సార్లు రికార్డుల నుంచి తొలగించారో.. లెక్కలేదు. ప్రతిపక్షంలో ఉండగా.. తన ఎమ్మెల్యేలకు.. ఎలాంటి సుద్దులు చెప్పని జగన్.. అధికారంలోకి వచ్చాక మాత్రం.. పద్దతిగా ఎలా ఉండాలో.. ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తున్నారు.
ఇటలీకి వెళ్తే ఇటాలియన్గా వ్యవహరించాలన్నట్లుగా … జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా.. అలాగే ఉండాలని.. అధికారపక్షంలోకి వచ్చిన తర్వాత.. అధికార పార్టీగానే వ్యవహరించాలని.. భావించినట్లున్నారు. ఆ విధానాన్ని పక్కాగా పాటిస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీలో… టీడీపీ ఎమ్మెల్యేలంతా సీనియర్లే ఉన్నారు. సభా సంప్రదాయాల పట్ల.. వారికి గౌరవం ఉంటుంది. గత అసెంబ్లీలో జరిగినట్లుగా… ఈ అసెంబ్లీలో ప్రతిపక్షం వ్యవహరించదని.. మొదటి సమావేశాలతోనే తేలిపోయింది. మరి అధికారపక్షం ఎలా వ్యవహరిస్తుందన్నదే కీలకం.