ఆంధ్రప్రదేశ్‌లో పొగాకు రైతులు కొంత కాలంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు చేసేవారు తగ్గిపోవడం… నాణ్యత లేదనే సాకులు చెప్పడం వంటి కారణాలతో.. రైతుల్ని దగా చేయడం ఎక్కువయింది. దీనికి చెక్ పెట్టడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. పొగాకును ఏపీ సర్కారే కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం ఐఏఎస్ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయబోతున్నారు. కొనుగోలుకు వీలుగా ఈ సంస్థ లైసెన్స్ తీసుకుంటుంది. పొగాకు బోర్డు, కంపెనీలు, వ్యాపారులతో కలిసి కొనుగోలు ప్రక్రియ చేపడుతుంది.
పొగాకుకు కనీస ధరలు ప్రకటించి ఆ ధరకన్నా ఎక్కువకు కొనుగోలు చేసేలా చేయడమే ఈ సంస్థ ఉద్దేశం. సంస్థ ఏర్పాటుకు కొంత సమయం పడుతుంది కాబట్టి.. అప్పటి వరకూ మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరపాలనిప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి పొగాకు రైతులు ఇష్టానుసారం పంట పండించడం లేదు. వారికి అధికారులు ఎంత పంట పండించాలో నిర్దేశిస్తున్నారు. అనుమతుల మేరకే పంట పండించినా గిట్టుబాటు ధర రావడం లేదు. కొనుగోలు లైసెన్స్ పొందిన వ్యాపారాలు.. వేలం కేంద్రాల వైపు రావడం లేదు. ఆర్డర్లు ఉన్నా, గడువు ముగిసినా కొనుగోలుకు ముందుకు రావడం లేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
920 మందికి లైసెన్స్‌లు ఇస్తే 15 మందికి మించి వేలంలో పాల్గొనడం లేదు. వ్యాపారులు అంతా ఓ రింగ్‌గా ఏర్పడి.. రైతుల్ని దోచుకుంటున్నారని ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది. పొగాకుకు గ్రేడ్ల వారీగా 2 రోజుల్లో కనీస ధరలు ప్రకటించాలని సీఎం నిర్ణయించారు. వీటి ఆధారంగానే వేలం నిర్వహించాలన్నారు. ధాన్యం లాగా.. పొగాకును కూడా ప్రత్యేక సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తే.. పొగాకు రైతులు.. ఒడ్డున పడతారు. ఇంత కాలం కష్టాల సాగు చేస్తున్న వారికి.. ప్రబుత్వం అండగా నిలిచినట్లుగా అవుతుంది.