కదిరిలో వైసీపీ ఓటమికి కారణమని .. కారణం చెప్పి మాజీ ఎమ్మెల్యే సిద్దారెడ్డిని పార్టీ నుంచి జగన్ బహిష్కరించారు. అసలు సమీక్షలేమీ లేకుండా హఠాత్తుగా జగన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో అనంతపురం రాజకీయవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఆయన ఏదో రచ్చ చేసి పార్టీ మారబోతున్నారని సమాచారం రావడంతో ఈ వేటు వేసినట్లుగా అనుమనిస్తున్నారు.
ఇటీవలి ఎన్నికల్లో సిద్దారెడ్డికి జగన్ కేటాయించలేదు. మైనార్టీకి ఇవ్వాలన్న ఉద్దేశంతో మక్బూల్ అహ్మద్ అనే నేతకు టిక్కెట్ కేటాయించారు. టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ చేతిలో ఓటమిపాలయ్యారు. తన ఓటమికి కారణం సిద్ధారెడ్డేనని అహ్మద్ పార్టీ నాయకత్వానికి చెప్పుకున్నారు. అదే సమయంలో పాత లెక్కలు ఏవో తేలకపోవడంతో వేటు వేసేశారు. ఇదే సందు అనుకుని తమకు వ్యతిరేకంగా పని చేసిన ఇతర నేతల పేర్లతో పలువురు నేతలు.. జగన్ వద్దకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.
పార్టీ ఓటమికి కారణమయ్యారని.. వారికి పట్టు ఉన్నచోట కూడా ఇతర పార్టీలకు ఓట్లు వేయించారని ఆధారాలతో సహా పార్టీ హైకమాండ్ వద్దకు వెళ్తున్నారు. అయితే అసలు పార్టీ ఘోర పరాజయానికి కారణం జగనేనని మందు ఆ విషయంలో ఏదో ఒకటి తేల్చాలని కరుడుగట్టిన కార్యకర్తలు కొందరు గుసగుసలాడుకుంటున్నారు.