వైఎస్ జగన్ ఏపీకి కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతుండటంతో… ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నారు అధికారులు.
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 12.33కి జగన్ అనే నేను… అంటూ ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నారు.
ఇందుకు సంబంధించి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.
మొత్తం 5వేల మంది పోలీసులు ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు.
రాష్ట్ర ప్రజలంతా టీవీలు, వెబ్ ఛానెళ్లలో ఎలాగూ లైవ్ చూస్తారు.
విజయవాడ ప్రజలు మాత్రం ప్రత్యేకంగా చూసేందుకు 14 ప్రాంతాల్లో LED స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు నుంచీ DMK అధినేత స్టాలిన్ వస్తున్నారు.
యాజ్ యూజువల్‌గా విజయవాడలో హోటళ్లు, రెస్టారెంట్లూ కళకళలాడుతున్నాయి.
ఎక్కడ చూసినా జగన్ కటౌట్లే కనిపిస్తున్నాయి. మరి ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సంబంధించిన కీలక అంశాల్ని చకచకా తెలుసుకుందాం.
– విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరుగుతుంది.
– వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు… ఫ్యామిలీలతో సహా వస్తున్నారు.
– గవర్నర్ నరసింహన్ (ప్రమాణం చేయిస్తారు), తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు నుంచీ DMK అధినేత స్టాలిన్ వస్తున్నారు.
– వీళ్లంతా జగన్‌తో కలిసి బెజవాడ దుర్గమ్మను దర్శించుకోబోతున్నారు.
– స్టేడియంలో 20,000 మంది మాత్రమే కూర్చునే ఛాన్స్ ఉంది.
– మొత్తంగా 18 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వీలైనంత ఎక్కువ మంది చూసేలా 14 ప్రదేశాల్లో LED స్క్రీన్లు రెడీగా ఉన్నాయి.
– గురువారం జగన్… తాడేపల్లిలోని ఇంటి నుంచీ స్టేడియం వరకూ ఓపెన్ టాప్ వాహనంలో వస్తారు.
– VVIPల కోసం స్టేడియంలో మూడు ఎంట్రెన్స్‌లు ఉన్నాయి.
– ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికీ 150 నుంచీ 200 పాస్‌లు ఇచ్చారు.
– నిర్మాణాత్మక సలహాలు ఇస్తామన్న మాజీ సీఎం చంద్రబాబు రాకపోవచ్చని తెలిసింది.
– సెక్యూరిటీ కోసం 5000 మంది పోలీసులు, డ్రోన్ కెమెరాలు, బాడీ ఎటాచ్డ్ కెమెరాలూ రెడీ.
– స్టేడియంకి వెళ్లేందుకు ప్రత్యేక సిటీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు.
– టెంట్లలో కూర్చునే ప్రజల కోసం మజ్జిగ, లస్సీ ప్యాకెట్లు, మంచి నీళ్లు, స్నాక్స్ ఇస్తారు.
ఒక్కమాటలో చెప్పాలంటే ఓ పండుగ లాగా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు.