ప్రభుత్వంలో పదవులు అనుభవించి..ఇప్పటికీ అనుభవిస్తున్న కొంత మంది నేతలు పార్టీ కోసం పని చేయకపోతూండటంతో వారందర్నీ జగన్ పక్కన పెట్టేశారు. తాజాగా ఎనిమిది జిల్లాల అధ్యక్షుల్ని మార్చేశారు. మాకొద్దు బాబోయ్ అని రాజీనామా చేస్తున్నట్లుగా జిల్లాల అధ్యక్షులతో పాటు మరో ఐదు జిల్లాల అధ్యక్షుల్ని తొలగించారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించారు. అదే సమయంలో ప్రాంతీయ సమన్వయకర్తల్ని చాలా వరకూ మార్చేశారు. ప్రాంతీయ సమన్వయకర్తల పదవులు పోగొట్టుకున్న వారిలో సజ్జల, బుగ్గన, అనిల్ కుమార్ తో పాటు కొడాలి నాని కూడా ఉన్నారు.
ఇటీవల మంత్రి వర్గ విస్తరణ చేపట్టినప్పుడు సగం మందికి మళ్లీ చాన్సిచ్చిన జగన్.. మరో సగం మందిని మాత్రం తీసేశారు. వారందరికీ జిల్లా అధ్యక్ష పదవులు.. ప్రాంతీయ సమన్వయకర్తల పదవులు ఇచ్చారు. అయితే వారిలో ఎవరూ పార్టీ కోసం పని చేయడం లేదు. సజ్జల ప్రభుత్వ , పార్టీ వ్యవహారాలను రాష్ట్ర స్థాయిలో చూస్తూ బిజీగా ఉంటారు. అందుకే ఆయన ఇచ్చిన రాయలసీమలోని రెండు జిల్లాల సమన్వయకర్త పదవి నుంచి జగన్ తప్పించారు. ఇక పని చేయడం లేదన్న కారణంగా మంత్రి బుగ్గననూ తప్పించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్, కొడాలి నానిలకు ఇచ్చిన రెండేసి జిల్లాల బాధ్యతలను కూడా లాగేసుకున్నారు.
గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రాంతీయ సమన్వయకర్తలదేనని జగన్ చాలా సార్లు చెప్పారు. వారు ఫెయిలయ్యారని ఓ సమావేశంలో ప్రకటించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి తీరుపై అప్పట్లో స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.. విచిత్రంగా ఆయనను సమన్వయకర్త పదవి నుంచి తొలగించకపోగా..మరో జిల్లాను అదనంగా ఇచ్చారు. మిగిలిన వారిని మాత్రం పక్కన పెట్టారు. జిల్లా అధ్యక్షుల్లోనూ పని చేయడం లేదనుకున్న వారిని పక్కన పెట్టి కొత్త వారిని నియమించారు.
ఈ నియామకాల్లో విశేషం ఏమిటంటే.. పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతను . చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చారు. ఈ బాధ్యత విజయసాయిరెడ్డికి ఉంది. అయితే ఆయనకు సహాయంగానే ఉంటాడని.. పార్టీ వర్గాలు చెబుతున్నా.. అసలు విజయసాయిరెడ్డి తోక కత్తిరించడానికే చెవిరెడ్డిని నియమించారని అంటున్నారు.