ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పాలకొండ సమీపంలో కొనసాగుతోంది. అయితే, పాదయాత్ర ప్రసంగాల్లో జగన్ ఫాలో అయ్యే రూల్స్ ఏంటంటే… ప్రతీ చోటా టీడీపీని పెద్ద ఎత్తున విమర్శలు చేయడం. రాష్ట్రంలో ప్రభుత్వమే లేనట్టు, ఉన్నదంతా అవినీతిమయం అన్నట్టుగా ఆరోపణలు చేయడం. తాను ముఖ్యమంత్రి అయితే తప్ప, రాష్ట్రంలో ఏ సమస్యా తీరదని చెప్పడం! ఇప్పుడు కూడా.. తిత్లీ బాధితులకు చంద్రబాబు న్యాయం చెయ్యలేదనీ, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాధితులకు సాయం చేస్తామన్నారు. ఈలోగా వారి తరఫున పోరాటం చెయ్యొచ్చు అనే కోణాన్ని జగన్ ఎప్పుడూ వదిలేస్తుంటార్లెండి.
ఇక, రెండోది… స్థానిక సమస్యలపై మాట్లాడటం. వాటిలో ఎక్కువగా కనిపించేంది తాగునీటి సమస్య. ఒక నీళ్ల బాటిల్ ను ప్రజలకు చూపించి… ఇలాంటి నీరు ప్రజలు తాగుతున్నారనీ, చాలా సభల్లో చెబుతారు. పాలకొండలోనూ అలాగే… ఒక బాటిల్ ప్రజలకు చూపిస్తూ, ‘పాలకొండ ప్రజలు ఇలాంటి నీరు తాగాల్సి వస్తోంది’ అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. వాస్తవం ఏంటంటే… పాలకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో తాగునీటికి ఎలాంటి ఇబ్బందీ లేదు. పైగా, పాలకొండకు దాదాపు ఓ మూడు కి.మీ. దూరంలోనే సంకిలి సమీపంలో నాగావళి నది ఉంది. భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. బోరు తవ్వితే ఓ యాభై అడుగుల కంటే తక్కువ లోతులోనే మంచి నీరు పడుతుంది. పాలకొండలో నీటి సరఫరా బాగానే ఉంది. ఇంకోటి, చేతి పంపులు కూడా కావాల్సినన్ని ఊళ్లలో ఉన్నాయి. జగన్ చేతిలో ఉన్నట్టుగా మరీ అంత మురికిగా.. ఆ రంగులో ఉన్నట్టుగా తాగునీళ్లు కలుషితమయ్యే అవకాశం లేదన్నది స్థానికులకు తెలుసు.
చేతి పంపు నీళ్లు తీసుకున్నా, కుళాయిల ద్వారా వచ్చే నీళ్లు తీసుకున్నా, కాస్త ఓపిక చేసుకుని పాలకొండ నుంచి రాజాం వెళ్లే రోడ్డులో ప్రయాణిస్తే కనిపించే నాగావళి నదిలోనైనా ఇలాంటి రంగు నీళ్లు లేవన్నది అక్కడి ప్రజలకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. జగన్ చేతిలోని బాటిల్ చూసి… స్థానికులే ముక్కున వేలేసుకునేట్టుగా ఉందన్నది వాస్తవం. ఇతర సమస్యలపై జగన్ విమర్శలు చేసినా కొంతనయంగానీ… పాలకొండలో ప్రజలు ఇంత మురికి నీరు తాగుతున్నారంటూ చెప్పడం మరీ విడ్డూరంగా ఉంది. అలాగని, తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలు రాష్ట్రంలో లేవని చెప్పడం లేదు. కానీ, ప్రతీచోటా ఒకేలా బాటిల్ చూపిస్తుంటే… ప్రసంగంలో అదీ ఒక ఐటమ్ అన్నట్టుగా ప్రజలు భావించే అవకాశం ఉంది.