గుంటూరు జిల్లా పల్నాడులోలో సోమవారం చిటపట చినుకులతో వాతావరణం ఆహ్లాదంగా ఉంది కానీ.. వైసీపీ నేతలు మాత్రం చిటపటలాడిపోయారు. దానికి కారణం.. గురజాల నియోజకవర్గంలో.. అక్రమ మైనింగ్ వ్యవహారంలో..నిజనిర్ధారణ చేస్తామంటూ.. బయలుదేరిన వైసీపీ నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడమే. గుంటూరు నుంచి వస్తున్న బొత్సను.. నరసరావు పేట నుంచి రావాలనుకున్న కాసు మహేష్ రెడ్డిని.. ఇతర నేతలను పోలీసులు గురజాలకు పోనివ్వలేదు. దీంతో వైసీపీ నేతలు… ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. వైఎస్ జగన్ కూడా.. తమ పార్టీ నేతలను అడ్డుకోవడాన్ని ఖండిస్తూ.. ఓ ట్వీట్ చేసారు.
సోమవారమే.. సాక్షి పత్రికలో .. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.. అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని.. కూలీలను నిందితులుగా మార్చి బలి చేస్తున్నారని.. చాలా పెద్ద కథనం ప్రచురించారు. ఫ్రంట్ పేజీతో పాటు.. లోపల ఓ పేజీ మొత్తం యరపతినేని కోసం కేటాయించారు. కనీసం మంత్రి కూడా కానీ.. ఓ ఎమ్మెల్యేపై అంత పెద్ద కథనం ఏమిటా అని ఆశ్చర్యపోయారు. కొద్ది రోజుల కిందట.. యరపతినేని శ్రీనివాసరావుకి అక్రమ సన్నపురాయి తవ్వకాల వివాదంలో వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గురజాల నియోజకవర్గంలోని నడికుడి, కోనంకి, కేశానుపూడి గ్రామాల్లో అక్రమంగా సున్నపురాయి తవ్వకాలు జరుపుతున్నారంటూ… 2015లో కొంత మంది వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇలా అక్రమ తవ్వకాలను.. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరులే చేపడుతున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. అక్రమ మైనింగ్ నిలిపివేయాలని… ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని వసూలు చేయాలని ఆదేశించింది.
ఆ తర్వాత కొన్నాళ్లకు వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే టీజీవీ కృష్ణారెడ్డి దీనిపై మరో పిల్ వేశారు. హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయలేదని .. ఎమ్మెల్యే యరపతినేనిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. టీజీవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరిపిన హైకోర్టు… అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆగస్టు 21న తదుపరి విచారణ జరిగేలోపు.. అక్రమ మైనింగ్ దారుల నుంచి జరిగిన నష్టాన్ని రాబట్టే విషయంలో ఎలాంటి పురోగతి చూపించారో.. నివేదిక సమర్పించాలని హైకోర్టు ధర్మానసనం ఆదేశించింది. ఆ కేసులో మొదట హైకోర్టు విచారణ జరిపినప్పుడు..మైనింగ్ చేస్తున్న కొందరు వ్యక్తులను పట్టుకున్నారు. వారినే నిందితులుగా చూపించారు. దీనిపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూలీలను చూపించి.. వారే మైనింగ్ చేస్తున్నారని ఎలా అంటారని సూత్రధారుల్ని కనిపెట్టాలని ఆదేశించింది. ఈ కేసులో వైసీపీ నేత టీజీవీ కృష్ణారెడ్డి .. ఎమ్మెల్యే యతరపతినేని, ఆయన అనుచరుల హస్తం ఉందని… పిల్ దాఖలు చేయడంతో.. ఎమ్మెల్యే వివరణ తీసుకోవాలని హైకోర్టు నిర్ణయించింది. ఆ మేరకు నోటీసులు జారీ చేసింది.
అప్పట్నుంచి వైసీపీకి యరపతినేని టార్గెట్‌గా మారిపోయారు. ఆయనపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ సారి యరపతినేని ఇష్యూనూ.. రాష్ట్ర స్థాయి అంశంగా మార్చారు. అయితే.. తనపై జగన్ పగ బట్టడానికి కారణం.. సరస్వతి భూములపై తాను పోరాటం చేయడమేనంటున్నారు యరపతినేని. వైఎస్ సీఎంగా ఉండగా… సిమెంట్ ఫ్యాక్టరీ పెడతానని.. దాచేపల్లి దగ్గర… భూములు సేకరించారు. కానీ ఇంత వరకూ పరిశ్రమ పెట్టలేదు. దాంతో ఆ భూముల్ని రైతులకు ఇవ్వాలంటూ.. యరపతినేని ఆందోళ చేశారు. ఓ సారి రైతులతో నాట్లు కూడా వేయించారు. అప్పుడు రైతులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం సంచలనం సృష్టించింది. తాను ఆ భూములపై పోరాడుతున్నందునే తనను టార్గెట్ చేస్తున్నారని యరపతినేని అంటున్నారు. మరి ఈ వివాదం ఎటు వెళ్తుందో..మరి…!