వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టో… ప్రతి అధికారి వద్ద ఉండాలని..దానికి తగ్గట్లుగానే పనితీరు మెరుగుపరుచుకోవాలని అధికార యంత్రాంగానికి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో…జగన్మోహన్ రెడ్డి భిన్నంగా వ్యవహరించారు. తన ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ఎత్తిచూపుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించారు. గుడ్ పోలీసింగ్, గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిందికాదని ఎత్తిపొడిచారు. అక్రమ మైనింగ్, ఇసుక మాఫియా, ఎమ్మార్వోపై .. టీడీపీ ఎమ్మెల్యే జులుం వంటి అంశాలను సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. గుడ్ పోలీసింగ్, గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎలా ఉండకూడదో.. భవిష్యత్తులో ఎలా ఉండాలో జగన్ అధికార యంత్రాంగానికి వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక ఘటనలను సీఎం ఉదాహరణలుగా చెప్పారు. కృష్ణాజిల్లాలో ఇసుక తవ్వకాలు ఆపినందుకు టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం, గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్, షాపులు, థియేటర్స్ వద్ద ఎమ్మెల్యేల వసూళ్ల పర్వం, రాజధానిలో బలవంతంగా భూములు లాక్కోవడం వల్ల 11 మంది ఆత్మహత్య చేసుకున్న సంఘటనలతోపాటు బెజవాడలో కాల్ మనీ కేసులు ఇవన్నీ చూస్తే మంచి పోలీసింగ్ అని ఎలా అనిపించుకుంటుందని నిలదీశారు. క్లబ్ లు, జూదం, బెట్టింగ్ లు యథేచ్ఛగా నిర్వహించారని ఆయన గుర్తుచేస్తూ ఇటువంటివన్నీ కూడా అరికట్టాల్సిన బాధ్యత పోలీస్ అధికారులపైనే ఉందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు ఎవరైనా, ఎంతటివారైనా సరే అవినీతి పనులు, లూటీలు, అక్రమాలు చేయమని మీ దగ్గరకు సిఫార్సు కోసం వస్తే ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని సీఎం జగన్.. ఎస్పీలను ఆదేశించారు.
ఎమ్మెల్యేలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం నేరుగా అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎన్నుకున్నవారిని మీ వద్దకొస్తే వారిని చిరునవ్వుతోనే పలకరించి సమస్యను అడిగి తెలుసుకోవాలని, నిబంధనల ప్రకారం ఉంటే ఆ పని చేయాలని, అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలను భాగస్వాములు చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. కలెక్టర్ల మాదిరిగా జిల్లాల ఎస్పీలు కూడా ఆకస్మిక తనిఖీలు చేయాల్సిందేనని, గ్రామాలకు వెళ్లి బలహీనవర్గాల కాలనీల్లో నిద్రించాలని, ప్రజల స్పందనను స్వయంగా మీరే తెలుసుకోవాలని కోరారు. అవినీతి, అక్రమాలు చేయమని ఎవరైన చెపితే వారి మాట వినొద్దని సీఎం జగన్.. అధికారులకు భరోసా కల్పించారు. తాను కూడా ఇటువంటి వ్యవహారాల్లో ఎక్కడా జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు.