వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్చికెళ్లినప్పుడు.. ఆయన అనుచరులు ఎప్పుడై జై జగన్ అని నినాదాలు చేయడం విన్నామా…? పోనీ.. ఆయన అత్యంత పవిత్రంగా.. ఆయన తండ్రికి నివాళి అర్పించేటప్పుడు… ఇడుపులపాయలో.. ఆ నినాదాలు వినిపించాయా..?. తాను అత్యంత పవిత్రంగా చేయాలనుకున్న పనులు చేస్తున్నప్పుడు… ఎక్కడా నినాదాలు, గందరోగళం లేకుండా పరిశుద్ధాత్మతో ఆయన ఇష్టమైన వారిని సేవించుకుంటారు. కానీ.. తిరుమలకు వచ్చినప్పుడు మాత్రమే… ఎందుకి రచ్చ జరుగుతుంది..? శ్రీనివాసుని నామజపం మాత్రమే చేయాల్సిన చోట జైజగన్ నినాదాలు ఎందుకు హోరెత్తుతాయి…? కొన్ని వందల మందిని వెంటేసుకుని కొండపైకి రావాల్సిన అవసరం ఏముంది..?
తిరుమలలో ప్రతీ సారి ఈ వివాదమేంటి..?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు శ్రీవారిపై మనస్ఫూర్తిగా నమ్మకం లేదు. ఆ విషయం ఆయన అనేక మార్లు డిక్లరేషన్లు ఇచ్చే సందర్భంలోనే…బయటపెట్టుకున్నారు. శ్రీవారిపై.. సంపూర్ణ నమ్మకంతోనే దర్శనానికి వచ్చినట్లు అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన ఎప్పుడూ ఇవ్వలేదు. ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఆయన క్రిస్టియన్. ఆ మతాచారాలనే గొప్పగా విశ్వసిస్తారు. అందులో తప్పు లేదు. ఎవరి విశ్వాసం వారిది. కానీ… మరో మతానికి చెందిన ప్రసిద్ధ ఆలయానికి వెళ్లి.. అక్కడి దేవుడ్ని కొలవాలనుకున్నప్పుడు.. కచ్చితంగా నమ్మకం ఉంచాలి. లేకపోతే.. అది ఓట్ల కోసం.. ఆడే రాజకీయమే అవుతుంది. అది దేవుడ్ని కించ పర్చడమే..!
జగన్ అసామాన్యుడా..? ఒక్కరే కాలినడకన వెళ్లారా..?
వైసీపీ కానీ.. ఆయన మీడియా కానీ సామాన్యుడిలా జగన్ నడుచుకుంటూ వెళ్లారని.. హోరెత్తిస్తూంటారు. జగన్ సామాన్యుడు కాదా.. అసామాన్యుడా…?… గాల్లోంచి ఆవిర్భవించాడా..?. ఆయనకు ఆయన చుట్టూ ఉన్న వంధిమాగధులకు ఆయన అసామాన్యుడేమో కానీ.. దేవుడి ముందు మాత్రం జగన్.. ఓ సామాన్యమైన మనిషే. ఆయనకు ఎలాంటి ప్రత్యేకహోదా ఉండదు. దేవుడి ముందు అందరూ సమానమే. ఆయన ప్రతిపక్ష నేత కాబట్టి… ఆయనకు వీఐపీ టిక్కెట్లు ఇస్తారేమో కానీ… దేవుడు ఆయనను వీఐపీగా పరిగణించడు. ఒక్క జగన్ మాత్రమే కాలి నడకన వెళ్లినట్లుగా జగన్ మీడియా విస్త్రతంగా ప్రచారం చేస్తోంది. రోజుకు… కాలి నడకన కనీసం 30 వేల మంది తిరుమలకు వెళ్తారని అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఒక్క జగన్ నడుచుకుంటూ వెళ్లినట్లు.. ఆయనకే.. వీరతాళ్లు వేయాలన్నట్లుగా.. ఈ ప్రచారం ఏమిటి..?
ఓట్ల కోసం చేసే ఆధ్యాత్మిక యాత్రలు ఇలాగే ఉంటాయా..?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు నచ్చిన క్రీస్తును ప్రార్థించడానికి చాలా చోట్ల చర్చిలకు వెళ్తారు. ఎక్కడా ఆయన అనుచరులు చుట్టుముట్టి.. చర్చిల్లోకి తోసుకెళ్లే సన్నివేశాలు కనిపించవు. కానీ.. తిరుమలలో మాత్రం.. ఆయన వెంట వస్తారో.. కావాలని తీసుకు వస్తారో కానీ.. వందల మంది.. ఆలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ కనిపిస్తారు. ఆయన చర్చిల్లో ప్రార్థనలు చేసుకుంటున్నప్పుడు.. అక్కడ అంతా ప్రశాంత వాతావరణం ఉంటుంది. కానీ తిరుమలలో మాత్రం జైజగన్ నినాదాలు హోరెత్తిపోతాయి. దానికి జగన్ చిరునవ్వుల మొహం తోడవుతుంది. అంటే.. జగన్ చేసేది.. కేవలం రాజకీయ యాత్ర. హిందువుల ఓట్ల కోసం పడే పాట్లు. అంతే తప్ప..శ్రీవారిపై నమ్మకం ఉండి కాదు.
——- సుభాష్