ముఖ్యమంత్రి హోదాలో… సీబీఐ కోర్టుకు హాజరైన జగన్… ఈ సారి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ కోర్టుకు హాజరయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈడీ కోర్టు ఈ మేరకు జగన్మోహన్ రెడ్డికి సమన్లు జారీ చేసింది. పదకొండో తేదీన ఈడీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. నాంకోర్టు నుంచి ఈడీ కోర్టుకు అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్ బదిలీ అయింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు ..ఈనెల 11న విచారణ హాజరుకావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. జగన్‌తో పాటు హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, అరంబిందో ఎండీ నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్‌రెడ్డి, టైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ చంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్యకు కూడా .. హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి.
జడ్చర్లలోని ప్రత్యేక ఆర్థిక మండలిలో హెటెరో డ్రగ్స్, అరబిందో ఫార్మా లిమిటెడ్‌లకు తలా 75 ఎకరాల్ని వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో కేటాయించారు. ధరల కమిటీ నిర్ణయించిన ధర కన్నా తక్కువ ధరకు ఈ భూమిని కేటాయించటం ద్వారా ఈ రెండు సంస్థలకూ నాటి ప్రభుత్వం లబ్ధి కలిగించింది. అలాగే పాశమైలారంలోని ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో అరబిందో ఫార్మా లిమిటెడ్‌కు కేటాయించిన భూమిని అది తన అనుబంధ సంస్థయిన ట్రైడెంట్ లైఫ్ సెన్సైస్‌కు బదలాయించింది. ఈ బదలాయింపు కూడా అక్రమం. ఇలా అరబిందో, హెటెరో సంస్థలకు ప్రభుత్వం అనుకూలంగా వ్యవహించింది. ఇలా చేసినందుకు ప్రతిఫలంగా ఆ సంస్థలు వై.ఎస్. జగన్మోహన్రెడ్డికి చెందిన సంస్థల్లో క్విడ్ ప్రో కో పద్దతిలో పెట్టుబడులు పెట్టాయని చార్జిషీట్లో ఈడీ పేర్కొంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి సీబీఐ కేసుల్లోనూ మినహాయింపు లభించలేదు. అయితే లాక్ డౌన్ తర్వాత ఇటీవలి కాలంలో విచారణ ప్రారంభమైనా ఆయన కోర్టుకు హాజరు కావడం లేదు. గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. ఈ కారణంగా ఆయన కోర్టుకు హాజరు కావడం లేదు. ఇప్పుడు ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. వెళ్తారో లేదో స్పష్టత లేదు. ఆ రోజున.. ఆబ్సెంట్ పిటిషన్ వేసినా ఆశ్చర్య పోనవసరం లేదని.. చెబుతున్నారు. మొత్తానికి సమన్లు అయితే ముఖ్యమంత్రికి చేరాయి.