శాసనమండలిని రద్దు చేయాలనే నిర్ణయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానాల్లో కీలక మలుపులాంటిది. ఆయన చెప్పేవి ఏవీ చేయరనే విమర్శలకు.. తండ్రి అడుగుజాడల్లో నడుస్తాననే ప్రకటనలకు భిన్నంగా.. రాజన్న బిడ్డగా ఒక్కఅవకాశం అంటూ.. ప్రజల మెప్పును పొంది.. అవకాశం దక్కించుకున్న నేతగా.. ఆయన పదవి దక్కిన తర్వాత భిన్నంగా వ్యవహరిస్తున్నారు. గొప్ప గొప్ప మాటలు చెప్పి.. రద్దయిపోయిన మండలికి మళ్లీ పునరుజ్జీవం పోసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసింది .. తప్పని తేల్చుకూ.. నేడు మండలి రద్దుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తాను అనుకున్న మూడు రాజధానుల బిల్లుకు మండలి ఓకే చేయకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారన్నది స్పష్టం.
ఒక్క శాసనమండలి విషయంలోనే కాదు.. వైఎస్ అడుగుజాడలను.. జగన్ అసలు నమ్మడం లేదు. చంద్రబాబు తర్వాత వైఎస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ.. అంతకు ముందు ప్రభుత్వ విధానాలను ఆయన తప్పు పట్టలేదు. పైగా.. తనదైన శైలిలో మరింత వేగవంతం చేశారు. ఫలితంగా.. చంద్రబాబు హయంలో పరుగులు పెట్టడం ప్రారంభించిన ఐటీ రంగం హైదరాబాద్లో పూర్తి స్థాయిలో విస్తరించింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు ప్రారంభమయింది. ఔటర్ రింగ్ రోడ్డు పూర్తయింది. అవన్నీ.. హైదరాబాద్ అభివృద్ధిలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. అవి మాత్రమే కాదు.. మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు వైఎస్ రూపకల్పన చేశారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తానన్న జగన్.. మాత్రం.. గత ప్రభుత్వం చేసిన వాటన్నింటినీ.. కొలాప్స్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
శాసనమండలి రద్దుతో ఏడాదికి రూ. అరవై కోట్ల ప్రజాధనం మిగులుతుందని లెక్కలు చెబుతున్నారు కానీ.. అంతకు మించి జరుగుతున్న దుబారా విషయంలో మాత్రం.. ప్రభుత్వం అలాంటి ఆలోచన చేయలేకపోతోంది. రంగులు, సలహాదారులు, లాయర్లకు కోట్లు.. ఇలా ప్రతీ విషయంలోనూ.. తనదైన ఖర్చును.. చూపిస్తున్న ప్రభుత్వం.. చట్ట సభల వ్యవస్థలో అత్యంత కీలకమైన… మండలిని మాత్రం.. అదో ఖర్చుగా భావిస్తూ.. రద్దు చేయడానికి సిద్ధమయ్యారు.