ఒకే సారి రూ. 12,500 రైతులకు పెట్టుబడి సాయం ఇస్తానని .. మాట తప్పనని… ఎన్నికల సభల్లో దీర్ఘాలు చేసి మరీ నవరత్నాల్లో ఒక రత్నం హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తీరా అమలు దగ్గరకు వచ్చేసరికి.. ఆ రత్నాన్ని మూడు ముక్కలుగా నరికి.. మూడు విడతలుగా ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతీ రైతు అక్టోబర్ పదిహేనో తేదీన తమ అకౌంట్లో రూ. 12,500 పడతాయని ఎదురు చూస్తూండగా.. ఒక్కరోజు ముందుగా… ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి మూడు విడతలుగా ఇవ్వాలని నిర్ణయించారు. మొదటగా..రూ. 7,500, తర్వాత పంట కోసే సమయంలో మరో రూ. 3,500, ఆ తర్వాత రబీ అవసరాల కోసం అంటే సంక్రాంతి సమయంలో.. మరో రూ. రెండు ఇవ్వాలని నిర్ణయించారు.
రూ. వెయ్యి పెంచి..మూడు ముక్కుల చేస్తే..రూ. ఐదు వేలు నష్టం..!
ప్రభుత్వం మూడు విడతలుగా ఇస్తామంటున్న మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సొమ్ము కాదు. ఇందులోనే కేంద్రం ఇచ్చే రూ. ఆరు వేలు ఉంటాయి. అంటే… మూడు విడతలు చేసినందుకు రూ. వెయ్యి పెంచి పంచుతోంది ఏపీ సర్కార్. కేంద్రం ఇచ్చే రూ. ఆరు వేలు… తామే ఇస్తున్నట్లుగా ఏపీ సర్కార్.. ఈ విధంగా ప్రచారం చేసుకుంటోంది. నిజానికి కేంద్ర ప్రభుత్వం కిసాన్ యోజన పథకాన్ని ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టింది. రూ. ఆరు వేలు రైతుల అకౌంట్లో వేయడం ప్రారంభించింది. కానీ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా పథకం కింద.. ఏడాదికి రూ. 12,500 ఇస్తామని… 2017లో జరిగిన ప్లీనరీలో ప్రకటించారు. అప్పటికే కేంద్రం రైతులకు రూ. ఆరు వేలు ఇస్తుందని తెలియదు. మొత్తంగా.. తమ ప్రభుత్వమే ఇస్తుందని అప్పుడే చెప్పారు. కానీ ఇప్పుడు తాను ఇచ్చిన మాటకే మడమ తిప్పారు. పెంచిన రూ. వెయ్యితో కలిపి ఇది రూ. 7,500 మాత్రమే అందుతుంది. అంటే.. రైతులకు ఏటా రూ. ఐదు వేలు నష్టం చేస్తున్నట్లే అవుతుంది.
ఒకే సారి ఇవ్వడానికి అప్పులు దొరకలేదా.. ?
మరో వైపు ఒకే సారి ఇస్తామని ఇప్పుడు మూడు విడతలుగా పంపిణీ చేయడానికి కారణం కూడా.. కేంద్ర డబ్బుల కోసమే. కేంద్రం.. రైతు భరోసా పథకాన్ని నేరుగా అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ నిధులు ఇవ్వడం లేదు. నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో వేస్తుంది. అదీ కూడా మూడు విడతలుగా వేస్తోంది. కచ్చితంగా కేంద్రం ఇచ్చే సమయంలోనే.. తాము కూడా… రైతుల అకౌంట్లో వేస్తే.. తామే ఇచ్చినట్లుగా పబ్లిసిటీ చేసుకోవచ్చనే కారణంగా… భరోసాను మూడు ముక్కలు చేసినట్లుగా భావిస్తున్నారు. అదే సమయంలో ఏపీ సర్కార్ కు కూడా.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. దొరికిన చోటల్లా అప్పులు చేసి.. పథకానికి నిధులు సమీకరించారు. తర్వాత తర్వాత పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది కాబట్టి… ఒకే సారి ఇవ్వలేమని… మూడు విడతలుగా ఇవ్వడమే మంచిదని భావించినట్లుగా తెలుస్తోంది.
భరోసాను ముక్కలు చేయడానికి రైతులే పావులు..!
రైతుభరోసా ఒకే సారి అమలు చేయడం సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చిన తర్వాత.. ప్రభుత్వం రైతుల పేరుతోనే.. కొత్త స్కిట్ వేసింది. రైతు ప్రతినిధుల పేరుతో కొంత మందిని … వ్యవసాయ కమిషన్ సమీక్షకు ముందు సీఎం వద్దకు పంపారు. వారే.. తమకు ఒకే సారి రూ. 12,500 వద్దని… మూడు విడతలుగా ఇవ్వాలని కోరారని ప్రచారం చేసుకున్నారు. ఎవరైనా డబ్బులన్నీ ఒకే సారి ఇస్తామంటే.. వద్దు.. మూడు సార్లు ఇవ్వాలని కోరేవారుంటారా..? వైఎస్ జగన్ పాలనలో మాత్రమే ఉంటారు. వారు కోరినట్లుగానే… పథకంలో మార్పులు చేశాం కానీ… తమ అభీష్టం కాదని చెప్పి.. అంతా రైతుల మీద తోసేసింది.. తెలివి ఎక్కువైపోయిన ఏపీ సర్కార్.