ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఆయనకు పిలుపు వచ్చిందో.. ఆయనే వెళ్లి కలవాలనుకుంటున్నారో కానీ.. హఠాత్తుగా మంగళవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ పర్యటన ఖరారు చేసుకున్నారు. సీఎంవో అధికారులు మీడియాకు ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రధానంగా అమిత్ షాతో సమావేశం అవుతారు. మరికొంత మంది కేంద్రమంత్రుల్ని కూడా కలుస్తారని చెబుతున్నారు. ఎజెండా ఏమిటన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పుడే కాదు.. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా ప్రజలకు తెలిసేలా ఎజెండాను ప్రకటించడం.. భేటీలు అయిన తర్వాత వివరాలు చెప్పడం లాంటివి చేయడం లేదు. తర్వాత జగన్ మీడియాలో వచ్చేదాన్ని బట్టి పోలవరం నిధులడిగారని.. మరొకకటని మీడియాకు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో అమిత్ షాను జగన్మోహన్ రెడ్డి తరచూ కలుస్తున్నారు. అయితే.. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క పనీ జరగడం లేదు. కనీసం పోలవరం నిధులు కూడా విడుదల కావడం లేదు. పోలవరం పరిస్థితి ప్రస్తుతం ఎవరికీ తెలియడం లేదు. రీఎంబర్స్ చేయడానికి కేంద్రం ఎప్పుడో అంగీకరించిన రెండున్నరవేల కోట్లు కూడా ఇవ్వడం లేదు. అదిగో ఇదిగో అంటున్నారు. ఇక తగ్గించిన అంచనాల సంగతి కూడా తేల్చడం లేదు. కేంద్ర ప్రాజెక్టులన్నీ నత్తనడకన నడుస్తున్నాయి. అదే సమయంలో ఏపీలో రాజకీయ పరిస్థితులు రాను రాను మతం రంగు పులుపుముకుంటున్నాయి.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని బీజేపీ నేతలపైనా కేసులు పెట్టి.. గుళ్లు, ఆలయాలపై ధ్వంసం చేశారని డీజీపీ లాంటి వారితో కూడా ప్రెస్మీట్లలో చెప్పించే పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని తాము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని.. హోమంత్రికి ఫిర్యాదు చేశామని బీజేపీ నేతలు కూడా ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సడెన్ ఢిల్లీ పర్యటన రాజకీయవర్గాల్లో సహజంగానే ఆసక్తి రేకెస్తోంది.