ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన పర్యటన హఠాత్తుగా ఖరారయింది. చాలా రోజుల నుంచి ఆయన కేంద్రమంత్రుల్ని కలవాలని అనుకుంటున్నారు. గతంలో రెండు, మూడు సార్లు ఢిల్లీకి వెళ్లిన తర్వాత కేంద్రమంత్రుల అపాయింట్మెంట్లు ఖరారు కాకపోవడంతో..వెనుతిరిగి వచ్చారు. ఈ సారి పార్లమెంట్ సమావేశాలు జరుగుతూండటం.. కేంద్రమంత్రులందరూ అందుబాటులో ఉండే అవకాశం ఉండటంతో…. విజయసాయిరెడ్డితో పాటు ఇతర ఎంపీలు..తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసి పలువురు కేంద్రమంత్రుల అపాయింట్మెంట్లు ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
పార్లమెంట్ సమావేశాలను కరోనా కారణంగా ముందుగానే ముగిస్తారనే ప్రచారం జరుగుతోంది. బహుశా 24వ తేదీతో ఆఖరు కావొచ్చు. ఆ తర్వాత మళ్లీ కేంద్రమంత్రుల్ని కలవడానికి పెద్దగా అవకాశం చిక్కదు. పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపే… ఓ సారి కలవాలని జగన్ అనుకుంటున్నారు. దాని ప్రకారం.. అపాయింట్మెంట్లు ఖరారు కావడంతో..మంగళవారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీకి బయలుదేరుతున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి జగన్.. 23వ తేదీన తిరుమలు వెళ్లి శ్రీవారికి పుట్టువస్త్రాలు సమర్పించాల్సిఉంది. ఈ కార్యక్రమం గురించి సీఎంవో నుంచి అధికారిక ప్రకటన వచ్చింది కానీ.. అనూహ్యంగా రాత్రి ఢిల్లీ టూర్ గురించి సమాచారాన్ని మీడియాకు ఇచ్చారు.
జగన్మోహన్ రెడ్డి అజెండా అమరావతి భూముల్లో సీబీఐ విచారణ…ఫైబర్ నెట్ లో స్కాం జరిగిందని సీబీఐ విచారణ వేయించడమేనని.. వైసీపీవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వైసీపీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలు మొత్తాన్ని ఈ రెండు అంశాలకే వాడుకుంటున్నారు. న్యాయవ్యవస్థపై విరుచుకుపడుతున్నారు. ఈ సమయంలో జగన్ ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది. అయితే.. ఢిల్లీ వెళ్లిన తర్వాత కేంద్రమంత్రుల అపాయింట్మెంట్లు ముఖ్యంగా అమిత్ షా అపాయింట్మెంట్ దొరకకపోతే..జగన్ మరోసారి నవ్వులపాలయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకే.. ఈ సారి పక్కాగా ఖరారు చేసుకున్న తర్వాతే ఢిల్లీ వెళ్తున్నారని అంటున్నారు.