ప్రాజెక్టుల టెండర్ల విషయంలో… పారదర్శకత కోసం.. ఎట్టి పరిస్థితుల్లోనూ.. జ్యూడిషియల్ కమిషన్ ఉండాలనుకుంటున్న ఏపీ ప్రభుత్వం దీని కోసం ఏకంగా చట్ట సవరణ చేయబోతోంది. జ్యుడీషియల్ కమిషన్ నియామకం కోసం ఏపీ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఎనేబిలింగ్ యాక్టు 2001కి కూడా చట్ట సవరణ చేయనున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, ఇంజనీరింగ్ ప్రాజెక్టుల్లో సమీక్ష కోసం ఈ జ్యుడీషియల్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కమిషన్ ఏర్పాటు కోసం చట్ట సవరణ అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది. పదకొండో తేదీ నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లోనే ఈ చట్ట సవరణకు ఆమోదం తెలుపనున్నారు. మొత్తంగా 11 అంశాల్లో చట్టాలను మార్చాడమో.. కొత్త వాటిని తీసుకు రావడమో చేయనుంది … ఏపీ సర్కార్.
ఆంధ్రప్రదేశ్లో లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించేలా తెలంగాణా తరహాలో చట్ట సవరణ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. విద్యుత్ నియంత్రణ మండలి సిఫార్సుల అమలుకు సంబంధించిన అంశంలోనూ చట్ట సవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజు నియంత్రణకు సంబంధించి కమిషన్లను ఏర్పాటు చేసేందుకు నూతన బిల్లులను శాసనసభ ముందుంచనుంది. మరోవైపు రాష్ట్రంలో వైద్యారోగ్యానికి సంబంధించిన సంస్కరణలు తీసుకురావాలని యోచిస్తున్న ప్రభుత్వం జిల్లా ఆస్పత్రులకు స్వయంప్రతిపత్తి కల్పించేలా సొసైటీలు, ట్రస్టు ల కిందకు తీసుకువచ్చేందుకు అవసరమైన చట్ట సవరణ కూడా చేయనున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్, పాలక మండలి సభ్యులను ఎప్పుడైనా రీకాల్ చేసేందుకు అవకాశం కల్పించేలా హిందూ ధార్మిక చట్టానికి కూడా సవరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై కూడా శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. 12 తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఈ సవరణ ముసాయిదా బిల్లులను శాసనసభ ముందుంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆలోచనలకు తగినట్టుగానే ఆయా అంశాల్లో మార్పుల కోసం ప్రభుత్వ శాఖలు కసరత్తు చేస్తున్నాయి. జగన్ కూడా… అధికారులకు కీలకమైన సూచనలు చేశారు.