వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సారి ఢిల్లీ వెళ్తున్నారు. శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశం కాబోతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పలుమార్లు ఢిల్లీ వెళ్లారు. మోడీతో పాటు కేంద్రమంత్రులను కలిశారు. కానీ.. కేంద్రం నుంచి తాను చేయాలనుకున్న పనులకు సంబంధించి.. ఎలాంటి గ్రీన్ సిగ్నల్స్ పొందలేకపోయారు. కానీ.. ఏకపక్ష నిర్ణయాలతో.. కేంద్రంతో సున్నం రాసుకున్నారన్న అభిప్రాయం మాత్రం బలపడిపోయింది. కేంద్రమంత్రులు.. రాజకీయంగా కాకుండా.. అధికార పరంగా తీసుకున్న నిర్ణయాల్లో జగన్మోహన్ రెడ్డిని మొహమాటం లేకుండా విమర్శిస్తూండటమే దీనికి కారణం. పోలవరం రివర్స్ టెండర్లు, పీపీఏలపై… జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలిపై.. కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో వాటిపై ప్రధానికి జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
పోలవరం రివర్స్ టెండర్ల వ్యవహారంలో కేంద్రాన్ని పూచికపుల్లలా జగన్మోహన్ రెడ్డి తీసేశారు. అదేతో ఆంధ్రప్రదేశ్ సొంత ప్రాజెక్ట్ అయినట్లు.. పాత టెండర్లు రద్దు చేసి..కొత్త టెండర్లను పిలిచేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వాన్ని కనీసం అనుమతి కూడా అడగలేదు. టెండర్లు వద్దని.. పీపీఏ చెప్పినా… జగన్ లైట్ తీసుకున్నారు. అదే సమయంలో పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల విషయంలో.. దేశ పెట్టుబడుల వాతావరణాన్ని జగన్ దెబ్బతీశారన్నది.. కేంద్రం అభిప్రాయంలా ఉంది. ఇవి మాత్రమే కాదు.. రాజకీయంగానూ… ఏపీలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపై.. బీజేపీ నేతల నుంచే అభ్యంతరాలు వస్తున్నాయి. పోలీసు పాలన చేస్తున్నారని.. ఏపీకి వచ్చిన ఆరెస్సెస్ నేతలకు.. ఏపీ బీజేపీ నేతలు నివేదికల మీద నివేదికలు ఇస్తున్నారు. ఈ సమయంలో.. మోడీతో జగన్ భేటీ కీలకంగా మారనుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో ఉంది. విద్యుత్ సంక్షోభంలో ఉంది. ఈ సంక్షోభాలన్నింటినీ ఎదుర్కోవాలంటే.. కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సాయం ఉండాలి. కానీ ముఖ్యమంత్రి తీరుతో… కేంద్రం ఎలాంటి సాయం చేసే అవకాశం లేదన్న చర్చ .. ఢిల్లీలో నడుస్తోంది. ఏపీకి సంబంధించి అనేక రకాల నిధులు విడుదల కావాల్సి ఉంది. కానీ… గట్టిగా అడగలేని పరిస్థితుల్లో జగన్ ఉన్నారు. అదే సమయంలో.. రైతు భరోసా పథకాన్ని ఈ నెల పదిహేనో తేదీ నుంచి ప్రారంభించాలని అనుకుంటున్నారు. దానికి ప్రధానిని ఆహ్వానించే అవకాశం ఉంది. అయితే.. కేంద్రం సొమ్ములు రూ. ఆరు వేలు.. తన రైతు భరోసా పథకం కలిపేసి.. జగన్ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో.. మోడీ వస్తారా.. అన్నది సందేహమే. సమస్యల వలయంలో ఉన్న జగన్కు మోడీతో భేటీ కీలకమే.