ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి.. ఎక్కువగా “రివర్స్” ఆలోచనలు చేస్తున్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ఇప్పటికే కాంట్రాక్టర్లందరినీ మార్చేశారు. అలాగే.. కృష్ణా- గోదావరి అనుసంధానాన్ని కూడా.. రివర్స్ పంపింగ్ ద్వారా చేయాలనుకున్నారు. దీనికి మొదట్లో.. కేసీఆర్ ఆలోచనలను ఉపయోగించుకుంటున్నారు. పోలవరం నుంచి.. తెలంగాణ భూభాగం మీదుగా… శ్రీశైలంకు నీరు రివర్స్ పంపింగ్ చేసి.. రాయలసీమకు నీళ్లు అందించాలనే ఆలోచన చేశారు. తర్వాత ఏమైందో కానీ.. ఏపీ భూభాగం నుంచే ఆ రివర్స్ పంపింగ్ చేస్తే బాగుంటుందనే ఆలోచన చేసి… ఆ మేరకు అధికారులకు కసరత్తు బాధ్యతలు అప్పగించారు.
గోదావరి వరద జలాలను కృష్ణా నదికి మళ్లించే క్రమంలో ప్రకాశం బ్యారేజీ, అక్కడి నుంచి పులిచింతల, నాగార్జునసాగర్‌కు రివర్స్ పంపింగ్ చేసే ప్రతిపాదనపై అధికారులు పరిశీలన జరిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించారు. కేపీఎంజీ, వ్యాప్కోస్ కలిపి రెండు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రివర్స్ పంపింగు విధానానికి రూ.75 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇది ఖర్చు మాత్రమే.. కానీ.. నిర్మాణం సాధ్యంకాదన్న అంచనాకు వచ్చారు. అనేక సాంకేతిక ఇబ్బందులు వస్తాయని.. రివర్స్ పంపింగ్ విధానంలో దాదాపు అనుసంధానం సాధ్యం కాదని తేల్చేశారు.
రివర్స్ అవసరం లేకుండా.. గోదావరి నుంచి బొల్లాపల్లి జలాశయానికి అక్కడి నుంచి పెన్నా, సీమ ప్రాంతాలకు జలాల తరలింపు ప్రతిపాదన బాగుంటుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే.. రివర్స్‌పై గట్టి నమ్మకం ఉన్న ముఖ్యమంత్రి మాత్రం… ఇప్పుడే తొందరపడవద్దని.. మరింత లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని.. ప్రాజెక్టుల అధికారులకు సూచించారు. ఎదేమైనా.. ఇంత కాలం.. రివర్స్ వర్కవుట్ కాదని.. ముఖ్యమంత్రికి చెప్పిన వారెవరూ లేరు. మొదటి సారిగా జనవరుల శాఖ మాత్రమే.. కాస్త సున్నితంగా ముఖ్యమంత్రికి రివర్స్ మంచిది కాదని చెప్పింది.